
జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కళ్యాణ్ రాయలసీమ పర్యటనలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీమ గురించి, అక్కడి రాజకీయాల గురించి, రైతుల గురించి పవన్ స్పందించారు. కడప జిల్లా రైల్వే కోడూరులోని శ్రీలక్ష్మీ ప్యారడైజ్ హాల్లో రైతు సమస్యలపై ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ పాల్గొన్నారు. పసుపు, ఉల్లి, టమాటా రైతులు తమ బాధలు ఆయన ఎదుట వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... "సగటు రైతులు, ఆడపడుచులకు న్యాయం చేసే వరకు జనసేన పార్టీ మీ తరఫున పోరాటం చేస్తుంది. రాయలసీమ యాత్ర పూర్తయ్యాక సీమ రైతుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్తా. మోడీ గారితో కలసి మొదట నిజామాబాద్ లో వేదిక పంచుకున్నప్పుడు పసుపు బోర్డు కావాలని అడిగితే ఇస్తామని మాటిచ్చారు. ఆ తర్వాత అక్కడ గెలిచిన ఎంపీ దాన్ని సాధించలేకపోయారు.` అంటూ పరోక్షంగా ఎంపీ కవితపై పవన్ మండిపడ్డారు.
రాష్ట్రంలోని రైతుల సమస్యలపై ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాస్తానని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ``మన దేశంలోనే సీమలోని కొన్ని జిల్లాల్లో వర్షపాతం తక్కువ. నేను రాయలసీమ పర్యటనలో చూస్తే నాయకులు ఉన్న చోట పొలాలు పచ్చగా ఉన్నాయి. సామాన్యులు ప్రజల భూములు ఎండిపోవడం బాధ కలిగించాయి..చాలా సార్లు రాయలసీమకు వచ్చినప్పుడు ఇంత మంది యువత ఉన్నారు. నేను వచ్చినప్పుడు ఇక్కడ చూసిన ఆవేదన, కోపం, పౌరుషం, కడుపు మంట కనబడుతూ ఉంటుంది. మిగతా ప్రాంతాల్లో అది పిసరంత తక్కువే ఉంటుంది. ఇక్కడ ప్రజలు ఎందుకు కోపంతో ఉన్నారంటే.. నిజానికి ఇక్కడ కరువు లేదు. సృష్టించబడింది`` అని పవన్ ఆరోపించారు.
రాయలవారు ఏలిననాడు తటాకాలు, చెరువులు పెట్టి కాలువలు తవ్వించి, అప్పుడు సశ్య శ్యామలంగా ఉన్నప్పుడు ఇప్పుడు ఎందుకు పండవు అని పవన్ ప్రశ్నించారు. ``ఇక్కడున్న నాయకత్వం లోపమే అది. రాయలసీమ నుంచి జగన్ రెడ్డితో సహా ఇంతమంది ముఖ్యమంత్రులు వస్తే ఎందుకు వెనుకబాటు ఉంది? అంటే ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని చంపేసే పరిస్థితులు ఎక్కువ. అన్ని ప్రాంతాల్లో ప్రజలు నచ్చిన పార్టీకి మద్దతు ఇస్తారు. నాయకులు ఇక్కడిలా ఇళ్లలోకి వచ్చి ధ్వంసాలు చేయరు. నాయకులకు ఎదురు తిరిగితే మన ఇళ్ల మీద దాడులు చేస్తారు, చెట్లు నరికేస్తారు అన్న ధోరణి మారాలి.` అని అభిప్రాయపడ్డారు.
సినిమాల్లో సీమ సంస్కృతి అంటే నరకడం అని చెబుతారని అయితే అది నిజం కాదని పవన్ అన్నారు. ``నరకడమే సీమ సంస్కృతి అయితే ఇన్ని పంటలు ఎందుకు పండుతున్నాయి? అభివృద్ధి చెందిన కాలిఫోర్నియాతో రైల్వే కోడూరును ఎందుకు పోలుస్తున్నారంటే అంత సారవంతమైన నేల ఇక్కడా ఉంది. ఏ పంట వేసినా పండుతుంది. అయితే ఫలితం ఎవరికి వస్తుంది అన్నదే ప్రశ్న. ఎకరం నేల దున్ని కష్టపడి ఉల్లి పంట వేస్తే చేతికి 20 రూపాయిలు వస్తాయని ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్ లో చూస్తే ధర 100 రూపాయిలు ఉంటుంది. పసుపు ధర చూస్తే రూ.14 వేల నుంచి రూ. 4 వేలకు వచ్చింది. మరి రైతు ఎలా బతకాలి? అడిగేవారు లేరు. నాయకులు.. రైతుకి రెండు రూపాయలు ఇస్తే చాలు.. అదీ తమ దయ మీద అనుకొంటున్నారు. ఎంతసేపు కబ్జాలు చేద్దాం, బెదిరిద్దాం అని చూసే నాయకులే గానీ రైతుల కష్టాలు చూసేవారు లేరు. మీ ఆవేదన ప్రధాని దృష్టికి తీసుకు వెళ్తానని మాట ఇస్తున్నా. అసెంబ్లీ సమావేశాలలోపు రాయలసీమ రైతులకు అండగా ఓ కార్యక్రమం చేపడతా. పాలకులకు వినిపించేలా పోరాటం చేస్తా` అని హామీ ఇచ్చారు.