న్యూఢిల్లీ: 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసిన విషయం తెలిసిందే. ఈ పరాజయం తర్వాత నైతిక బాధ్యత తాను వహిస్తూ రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అయితే శుక్రవారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అధ్యక్ష పదవికి ఎన్నికల షెడ్యూల్‌ను ఖరారు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి కొత్త నేతను ఎంపిక చేసేందుకు త్వరలోనే పార్టీ సంస్థాగత ఎన్నికలు జరగనున్నాయి.

ఈ సారి గాంధీ కుటుంబం నుంచి కాకుండా పార్టీలోని కీలక నేతకు అధ్యక్ష పదవి అప్పగించబోతున్నారనే వార్తలు వచ్చాయి. అశోక్ గహ్లోత్‌కు సోనియా గాంధీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారని వందల వార్తలు వినపడుతున్నాయి. అయితే అంతర్గతంగా మాత్రం రాహుల్ గాంధీనే మళ్లీ అధ్యక్షుడిగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని వినపడుతోంది. కాంగ్రెస్ పార్టీ వర్గాలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. గత ఎన్నికల తర్వాత రాజీనామా చేసినప్పటికి.. ఈ సారి కూడా ఆయన అధ్యక్షుడిగా రాబోయే సంస్థాగత ఎన్నికల్లో పోటీ చేస్తారని చెబుతున్నారు. మార్చి నెలాఖరున లేదా ఏప్రిల్‌లో ఏఐసీసీ ప్లీనరీ జరగబోతోందని, ఈ సమావేశంలో రాహుల్ గాంధీ తన కొత్త టీంను కూడా ఎంపిక చేయనున్నారని పార్టీ వర్గాలు చెప్పాయి.

గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ టీం ఉండబోతోందని తెలుస్తోంది. ఈ సారి రాహుల్ గాంధీ తన టీంలో సోదరి ప్రియాంక గాంధీతో పాటు సచిన్ పైలట్, మరి కొంత మంది యువ నేతలను వర్కింగ్ కమిటీలోకి తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఈ వర్కింగ్ కమిటీలో కొత్త వారికి ఎక్కువగా చాన్స్ ఇచ్చే అవకాశాలున్నాయి. పార్టీలో వృద్ద నేతలు ఈ సారి తమ పదవుల నుంచి తప్పుకోనున్నారని, వారి స్థానంలో కొత్త నేతలకు అవకాశం లభించనుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రియాంక గాంధీకి అనేక రాష్ట్రాల బాధ్యతలను అప్పగించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్‌తో పాటు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక బాధ్యతలను ఆమెకు అప్పగించే అవకాశాలున్నాయని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి.       

మరింత సమాచారం తెలుసుకోండి: