వాషింగ్టన్: కరోనా భయంతో గజగజ వణుకుతున్న అమెరికాలో.. ఈ భయాన్ని తగ్గించేందుకు ఇటీవలే అమెరికా నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన జో బైడెన్ షాకింగ్ నిర్ణయం తీసుకోబోతున్నారని సమాచారం. అదేంటంటే.. కొన్ని దేశాలకు వెళ్లి, మళ్లీ అమెరికాకు రావడానికి ప్రయత్నిస్తున్న విదేశీయులు అంటే నాన్-యూఎస్ పౌరులు ఎవరూ అమెరికాలో ప్రవేశించకుండా నిషేధం విధించాలనే యోచనలో ఆయన ఉన్నట్లు ఓ నివేదిక వెలుగు చూసింది. కరోనా వ్యాప్తిని నియంత్రించే క్రమంలో యూరప్‌ ఖండంలోని యునైటెడ్ కింగ్‌ డమ్, ఐర్లాండ్, అలాగే బ్రెజిల్ వంటి దేశాల ఇటీవల కాలంలో సందర్శించిన వారు అమెరికాలో అడుగు పెట్టకుండా నిషేధం విధించాలని బైడెన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతోంది. అలాాగే ఈ దేశాలకు అమెరికా ప్రజలు ఎవరూ వెళ్లకుండా కొత్తగా ఆదేశాలు జారీ చేసే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది.

ఈ జాబితాలో మొత్తం మీద 26 దేశాలు ఉన్నాయట. ఈ దేశాల నుంచి ఎవరైనా ఇతర దేశాల పౌరులు అంటే అమెరికన్లు కాని వారు.. ఎవరైనా సరే అమెరికాలో ప్రవేశించడం ఇక కష్టమే. అలా ఎవరూ రాకుండా కఠిన చర్యలు తీసుకుంటుందట బైడెన్ సర్కారు. అయితే ఈ దేశాలకు వెళ్లిన అమెరికన్ పౌరుల విషయంలో కొన్ని సడలింపులు ఉండే అవకాశం ఉందని కొంత మంది ఉన్నతాధికారులు అంటున్నారు. దీనిపై సోమవారం నాడు పూర్తి స్థాయి ప్రకటన వెలువడుతుందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఈ జాబితాలో తాజాగా సౌతాఫ్రికాను కూడా చేర్చినట్లు డాక్టర్ అన్నె షుచాట్ వెల్లడించారు. దక్షిణాఫ్రికాలో కొత్త కరోనా వేరియంట్ భయంతోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆమె చెప్పారు. కరోనాను నియంత్రించేందుకు అవసరమైన చర్యలన్నీ తీసుకుంటామని అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో చాలాసార్లు బైడెన్ హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత నుంచి పని చేస్తున్నారు. అధికారం చేపట్టిన వెంటనే దేశంలో మాస్క్ ధరించడం తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: