మాజీ మంత్రి, తెరాస ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్ బ‌లం రోజురోజుకు త‌గ్గిపోతుందా..? ఆయ‌న అనుచ‌రులు ఒక్కొక్క‌రిగా తెరాస పార్టీ అధిష్టానం మాటే శిరోధార్యం అంటున్నారా..? అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తుంది. ఇందుకు కార‌ణం డ‌బుల్ షూట‌ర్‌గా పేరుగాంచిన, ఈట‌ల ఫ్రెండ్ హ‌రీష్‌రావేన‌ట‌. రాష్ట్ర రాజ‌ధానిలో కూర్చొని హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో కార్య‌క‌లాపాల‌ను హ‌రీష్‌రావు చ‌క్క‌బెడుతున్నార‌ట‌. త‌న‌దైన వ్యూహాల‌తో పావులు క‌దుపుతూ అడుగ‌డుగునా ఈట‌ల‌కు చెక్‌పెడుతున్నార‌న్న వార్త నియోజ‌క‌వ‌ర్గంలో చ‌క్క‌ర్లు కొడుతుంది. మంత్రి గంగుల నియోజ‌క‌వ‌ర్గంలోని క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టిస్తూ ద్వితీయ శ్రేణి నేత‌ల వ్య‌వ‌హారాలు చ‌క్క‌బెడుతుండ‌గా.. హ‌రీష్‌రావు, వినోద్ కుమార్‌లు హైద‌రాబాద్ వేదిక‌గా హుజురాబాద్‌లోని తెరాస కీల‌క నేత‌ల‌తో భేటీ అవుతున్నారు.

ఉద్య‌మకాలం నుంచి మంత్రి హ‌రీష్‌రావు, మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌లు మంచి స్నేహితులు. తెరాస అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత పార్టీ కార్య‌క‌లాపాల్లో, పాల‌న‌లో వీరు కీల‌కంగా మారారు. కేసీఆర్ త‌న వార‌సుడిగా కొడుకు కేటీఆర్‌ను ఫోక‌స్ చేసే క్ర‌మంలో హ‌రీష్‌రావును ప‌క్క‌కు పెట్టార‌న్న ప్ర‌చారం అప్ప‌ట్లో సాగింది. ఈక్ర‌మంలో ఈట‌ల ప‌లుసార్లు హ‌రీష్‌రావును ఓదార్చార‌ట‌. వీరిరువురు పార్టీలో, మంత్రివ‌ర్గంలో ఎదుర‌య్యే ఇబ్బందులను ఒక‌రితో ఒక‌రు షేర్ చేసుకొని ప‌రిష్క‌రించుకొనేవారన్న టాక్ పార్టీలో ఉంది. అంత‌లా క‌లిసిమెలిసి ఉండేవారు. ఇటీవ‌ల ఈట‌ల ప‌లు టీవీ ఛానెల్స్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూల్లో హ‌రీష్‌రావు త‌న‌కు మంచి ఫ్రెండ్ అని, ప‌లుసార్లు కేసీఆర్ వైపునుంచి ఎదురైన ఇబ్బందుల‌ను ఒక‌రికొక‌రం చెప్పుకొని బాధ‌ప‌డేవాళ్ల‌మ‌ని తెలిపాడు.

ఈట‌ల మంత్రి వ‌ర్గంనుంచి బ‌ర్త‌ర‌ఫ్ అయిన త‌రువాత ప‌లుసార్లు హ‌రీష్‌రావు ఈట‌ల‌కు ఫోన్‌చేసిన‌ట్లు ప్ర‌చారంలో ఉంది. ప్ర‌స్తుతం ఈట‌ల‌ను హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో దెబ్బ‌తీసే బాధ్య‌త‌ను సీఎం కేసీఆర్ హ‌రీష్‌రావుకు అప్ప‌గించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కేసీఆర్ మాట‌ను జ‌వ‌దాట‌ని వ్య‌క్తిగా పేరుకున్న హ‌రీష్‌రావు త‌న‌దూకుడును పెంచి హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో ఈట‌ల అనుచ‌రుల‌తో, తెరాస ప్ర‌జాప్ర‌తినిధుల‌తో హైద‌రాబాద్‌లో భేటీ అవుతున్నారు. హ‌రీష్‌రావు అంటే తెరాస శ్రేణుల్లో ఎన‌లేని అభిమానం. ఈక్ర‌మంలో నేరుగా హ‌రీష్‌రావే రంగంలోకి దిగ‌డంతో ఇన్నాళ్లు ఈట‌ల‌కు మ‌ద్ద‌తుగా నిలిచిన‌వారుసైతం హ‌రీష్‌రావును క‌లుస్తున్న‌ట్లు ప్ర‌చారం సాగుతుంది. మొత్తానికి హ‌రీష్‌రావు ఎంట్రీతో హుజురాబాద్‌లో ఈట‌ల డీలా ప‌డుతున్న‌ట్లు ప్ర‌చారం సాగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: