దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. ఈ రోజు లీటర్ పెట్రోల్ 36పైసలు, డీజిల్ 38పైసల మేర పెరిగింది. హైదరాబాద్ లో పెట్రోల్ 112 రూపాయల 27పైసలకు చేరగా.. డీజిల్ ధర 105రూపాయల 46పైసలకు ఎగబాకింది. ఇక గుంటూరులో పెట్రోల్ ధర 114 రూపాయల 30పైసలు, డీజిల్ ధర 106 రూపాయల 52పైసలుగా ఉంది. ఇక దేశంలో అత్యధికంగా రాజస్థాన్ గంగానగర్ లో పెట్రోల్ ధర 120రూపాయలుగా ఉంది.

పెరుగుతున్న పెట్రోల్ ధరల కారణంగా కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రం త్వరలో ఫ్లెక్స్ ఇంజిన్ పాలసీని తీసుకురానుందని చెప్పారు. ఇథనాల్ ఆధారిత ఫ్లెక్స్ ఇంజిన్లు వాడటం ద్వారా పెట్రోల్ అవసరం తగ్గుతుందని తెలిపారు. దీని ద్వారా ఇంధన ధరల పెరుగుదల బాధలు తగ్గుతాయన్నారు. భవిష్యత్ అంతా ఇథనాల్ దేనని.. దేశంలో రైతులు కూడా ఇథనాల్ ఉత్పత్తి చేయొచ్చన్నారు.

అయితే ప్రస్తుతం డీజిల్ ధరల పెంపుతో రైతులు కష్టాలు పడుతున్నారు. గతంలో టైర్ హార్వెస్టర్ రెంట్ గంటకు 18రూపాయల నుండి 2వేల వరకు ఉండగా.. ఇప్పుడు డీజిల్ ధరలు పెరగడంతో.. 2వేల 500వరకు వసూలు చేస్తున్నారు. చైన్ హార్వెస్టర్ అయితే గంటకు 4వేల రూపాయల వరకు తీసుకుంటున్నారు. ఎకరం వరి పైరును కోసేందుకు గంట పడుతుంది. ఈ లెక్కన 4వేల రూపాయల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లేందుకు మరో వెయ్యి రూపాయలు కలిపి 5వేల వరకు ఖర్చు అవుతోంది.

పెట్రోల్, డీజిల్ గ్యాస్ ధరలే కాదు  చికెన్, మటన్, కోడిగుడ్డు, కూరగాయలు, నూనె, పప్పు.. చివరకు అగ్గిపెట్టె రేటు కూడా రెట్టింపయింది. 2వేల రూపాయలు పెట్టినా నెలకు సరిపడా నిత్యావసర రావడం లేదు. దీంతో సామాన్య, పేద కుటుంబాల బతుకు భారమైంది. చూద్దాం.. కేంద్రమంత్రి ప్రకటన ఏ మాత్రం సత్ఫలితాలనిస్తుందో.




మరింత సమాచారం తెలుసుకోండి: