పిఠాపురం రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం పార్టీ పునర్నిర్మాణం వేగంగా జరుగుతోంది. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలనే లక్ష్యంతో పవన్ కళ్యాణ్ ఈ నెల మూడో వారంలో పిఠాపురంలో పర్యటించి, గ్రామ, మండల స్థాయిలో నాయకులను ఎంపిక చేయనున్నారు. స్థానిక స్థాయిలో అధ్యక్ష పదవుల్లో మార్పులు జరిగే అవకాశమూ ఉన్నట్లు తెలుస్తోంది. దీనిద్వారా జనసేన స్థానిక ఎన్నికల సమయానికి పిఠాపురంపై పూర్తి పట్టు సాధించాలనే వ్యూహంతో ముందుకెళ్తోంది. అయితే ఈ పరిణామాలు రాజకీయంగా పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి. ఇప్పటి వరకు పిఠాపురం టిడిపీ బలమైన కోటగా ఉండేది. గత ఎన్నికలలో టిడిపీ సీనియర్ నేత వర్మ పెద్ద మనసుతో టికెట్‌ను వదిలి పవన్ కళ్యాణ్ విజయం కోసం పనిచేశారు.


 కానీ ఇప్పుడు వర్మ తిరిగి ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే ప్రయత్నాలు చేస్తున్నట్లు రాజకీయ వర్గాల సమాచారం. మరోవైపు పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గాన్ని మార్చే ఆలోచనలో లేరు. వచ్చే ఎన్నికల్లో కూడా పిఠాపురం నుంచే పోటీ చేయడం దాదాపు ఖాయమని జనసేన నాయకులు ధీమాగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జనసేన క్షేత్రస్థాయిలో తన పట్టు మరింత బలోపేతం చేస్తూ, మండల, జిల్లా స్థాయిలో కొత్త నాయకత్వాన్ని తీసుకువస్తోంది. దీనిని గమనిస్తున్న వర్మ వర్గం తీవ్ర ఆందోళనలో పడింది. పార్టీ నిర్ణయాలతో తమ రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందేమోనని వర్మ అనుచరులు ఆలోచనలో మునిగిపోయారు. గతంలో సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలు కూడా వాస్తవం కాలేదు. ఇప్పుడు అయితే చంద్రబాబు ఈ విషయంలో పూర్తిగా మౌనం వహిస్తున్నారు. పిఠాపురం గురించి ఎటు వర్మతోనూ, ఎటు జనసేన నాయకులతోనూ చర్చించకపోవడం గమనార్హం.



దీంతో రాజకీయ విశ్లేషకులు చెబుతున్నది ఏమిటంటే – చంద్రబాబు పిఠాపురాన్ని పూర్తిగా జనసేనకు అప్పగించినట్టే అని. దీంతో వర్మకు ఇక దారులు మూసుకుపోతున్నాయన్న భావన బలపడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో టిడిపీ టికెట్ రాకపోతే వర్మ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉందని ఆయన వర్గం చెబుతోంది. కానీ ఎన్నికలకు ఇంకా మూడున్నరేళ్ల సమయం ఉన్నందున, వర్మ తక్షణమే ఆ దిశగా అడుగులు వేస్తారా లేదా అనేది చూడాలి. ప్రస్తుతం అయితే పవన్ కళ్యాణ్ దూకుడుతో పిఠాపురం రాజకీయాలు ఉత్కంఠ భరితంగా మారాయి. టిడిపీ వర్మ బృందం ఏం చేస్తుందో, జనసేన తన పట్టు ఎంతవరకు నిలుపుకుంటుందో అన్నది రానున్న రోజుల్లో స్పష్టమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: