పవన్ కళ్యాణ్ మళ్ళీ స్పీడ్ పెంచారు. ఈసారి ఆయన కొత్త రూట్లో వస్తున్నారు. ఆయన రంగంలోకి దిగుతున్నారు. యాక్షన్ ప్లాన్ అంటూ ప్రకటించకుండానే సడెన్ గా ఆయన బరిలోకి దిగిపోతున్నారు.

విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేట్ పరం చేయవద్దంటూ పవన్ ఈ నెల 12న విశాఖ స్టీల్ ప్లాంట్ గేట్ వద్ద దీక్ష చేయబోతున్నారు. ఈ మేరకు పార్టీ వర్గాలు సమాచారం ఇచ్చాయి. ఆ రోజున పవన్ ఉక్కు ఉద్యమకారులతో కలసి ఈ దీక్ష చేస్తారు.

దీనికి నెలన్నర ముందు పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్ వద్ద భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఈ సభకు జనాలు బాగా వచ్చారు. నాడు ఆయన ఏపీ సర్కార్ కి అల్టిమేటం జారీ చేశారు. విశాఖ ఉక్కు విషయంలో అఖిల పక్షాన్ని వేసి మరీ కేంద్రం వద్దకు వెళ్ళి డిమాండ్ చేయకపోతే తన కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. వారం రోజులు గడువు కూడా నాడు ఇచ్చారు.

అయితే ఆ తరువాత పవన్ నుంచి ఏ రకమైన స్టేట్మెంట్ లేకపోవడంతో ఉక్కు కార్మిక సంఘాలు డీలా పడ్డాయి. కానీ ఇపుడు సడెన్ గా పవన్ దీక్షకు దిగబోతున్నారు అంటే అది సంచలనమే. అయితే పవన్ దీక్ష వరకూ ఒకే కానీ ఉక్కు విషయంలో వేగంగా అడుగులు వేస్తున్న కేంద్రానికి ఈ దీక్ష ఎంతవరకూ బ్రేకులు వేయగలదు అన్నది ప్రశ్నగా ఉంది.

మరో వైపు చూస్తే ఇప్పటిదాకా కార్మిక సంఘాలు దీక్షను చేస్తూనే ఉన్నాయి. పవన్ కూడా అదే పని చేసే కంటే ఉక్కు కార్మిక సంఘాలతో తనతో కలసి వచ్చే రాజకీయ పార్టీలతో ఒక డెలిగేషన్ ని ఢిల్లీకి తీసుకువెళ్ళి ప్రధానితో భేటీ అయితే మంచి ఫలితాలు వస్తాయని అంటున్నారు.

ఎటూ బీజేపీతో పొత్తు ఉన్నందువల్ల అపాయింట్మెంట్ విషయం పెద్ద ప్రశ్న కాదని అంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ దీక్ష చేసిన తరువాత అయినా ఈ విషయంలో సీరియస్ గా ఆలోచిస్తే ఆ లెక్కే వేరుగా ఉంటుంది. కేంద్రానికి కూడా నేరుగా ఉక్కు సెగ తగులుతుంది అంటున్నారు. అలా కాకుండా గల్లీలో ఎన్ని పోరాటాలు చేసినా కేంద్రం తన పని తాను చేసుకుపోవడం ఖాయమని అంటున్నారు. చూడాలి మరి దీక్షతో ఏ మాత్రమైనా కేంద్రం కదిలితే అది భారీ మేలు చేకూర్చినట్లే.


మరింత సమాచారం తెలుసుకోండి: