ఈనెల 28వ తేదీన విజయవాడలో జగన్మోహన్ రెడ్డి పాలనపై బీజేపీ ‘ప్రజాగ్రహసభ’ నిర్వహిస్తోంది. ఒకవైపు ఏపీ ప్రయోజనాల విషయంలో నరేంద్రమోడీ సర్కార్ దెబ్బమీద దెబ్బ కొడుతోంది. విభజన చట్టంతో సహా తాజాగా వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ వరకు ఏ విషయం తీసుకున్నా మోసం చేస్తునే ఉంది. దీనికి సమాధానం చెప్పుకోలేని కమలనాదులు జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాగ్రహసభ నిర్వహిస్తుండటమే విచిత్రంగా ఉంది.




ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపాల్సిందే. ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను ఎండగట్టాల్సిందే అనటంలో ఎలాంటి సందేహంలేదు. అయితే ఇక్కడ గమనించాల్సిందేమంటే తమలో ఎన్నో తప్పులు పెట్టుకుని జగన్ను తప్పుపడుతున్నారు బీజేపీ నేతలు. ఒకవేలు జగన్ను చూపిస్తుంటే మిగిలిన నాలుగు వేళ్ళు తమలోని తప్పులనే ఎత్తిచూపుతున్నాయని బీజేపీ నేతలు మరచిపోతున్నారు.




ముందు తమలో ఎలాంటి తప్పులు లేకుండా చూసుకుంటే ఆ తర్వాత ఎదుటివారిలోని తప్పులను ఎత్తిచూపినా ఎవరు ఏమీ అనుకోరు. నిజానికి బీజేపీ నిర్వహిస్తున్న ప్రజాగ్రహసభ సరిగ్గానే ఉందా అనేది కూడా సందేహమే. ఎందుకంటే బీజేపీ నేతలు చెబుతున్నట్లు జనాల్లో జగన్ పాలనపై అంతగా వ్యతిరేకత ఏమీ కనబడటంలేదు. రెండున్నరేళ్ళ పాలన తర్వాత జగన్ ప్రభుత్వంపై జనాల్లో కొంత అసంతృప్తి మొదలైన మాట వాస్తవమే.




ప్రభుత్వంపై అసంతృప్తి వేరు వ్యతిరేకత వేరని కమలనాదులు మరచిపోయారు. అసంతృప్తి బాగా పెరిగిపోతే వ్యతిరేకతగా మారుతుంది. ఈమధ్యనే జరిగిన స్ధానికసంస్ధల ఎన్నికలను పరిశీలిస్తే ఫలితాలు ఏకపక్షంగా వచ్చిన విషయం అర్ధమైపోతుంది. ఫలితాలు ఇంత ఏకపక్షంగా వచ్చిన తర్వాత కూడా జగన్ ప్రభుత్వంపై జనాల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగిపోతోందని కమలం నేతలు చెప్పటమే విచిత్రంగా ఉంది.




నిజం చెప్పాలంటే జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత అంతా ఎల్లోమీడియాలోను, ప్రతిపక్షాల్లో మాత్రమే కనబడుతోంది. తమలో జగన్ పై పేరుకుపోయిన వ్యతిరేకతంతా జనాల్లో కూడా పెరిగిపోతోందని ప్రతిపక్షాలు అనుకోవటమే ఆశ్చర్యంగా ఉంది. ఇపుడు ప్రభుత్వంపై మొదలైన అసంతృప్తి ముందు ముందు బాగా పెరిగిపోతే అప్పుడు వ్యతిరేకతగా మారుతుందేమో చూడాలి. అప్పటివరకు వెయిట్ చేయలని బీజేపీ ఇపుడే ప్రజాగ్రహసభ నిర్వహిస్తుండటమే విడ్డూరం.


 

మరింత సమాచారం తెలుసుకోండి: