క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి అలర్టవ్వాల్సిన సమయం వచ్చేసిందని అర్ధమవుతోంది. ఎందుకంటే షెడ్యూల్ ఎన్నికలకు ఉన్న సమయం  రెండేళ్ళు మాత్రమే కాబట్టి. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం కాబట్టి మనకు వచ్చిన ఇబ్బందే లేదని, మనకు ఎదురేలేదని ఒకవేళ జగన్ అనుకుంటే తప్పులో కాలేసినట్లే. పీఆర్సీ వివాదంపై ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమ్మెతో ఒక విధంగా రాష్ట్రంలో పెద్ద అలజడే రేగింది. వీళ్ళ సమ్మెతో రాష్ట్రమేమీ స్తంభించిపోలేదు.




అయితే దాదాపు అంతపనీ జరిగిందన్న విషయం మరచిపోకూడదు. ఉద్యోగుల, ఉపాధ్యాయుల సమ్మెకు విద్యుత్ , ఆర్టీసీ ఉద్యోగులు కూడా కలిసుంటే పరిస్ధితి ఏమయ్యేదో ? అప్పుడు నిజంగానే రాష్ట్రంమొత్తం స్తంభించిపోయేదే అనటంలో సందేహంలేదు. ఇక్కడ జగన్ గమనించాల్సిందేమంటే ఎవరు అడగకుండానే 27 శాతం ఐఆర్ ఇచ్చాను కదా, ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు రెండేళ్ళు పెంచాను కదా, జగనన్న కాలనీల్లో ఇంటిస్ధలాల్లో రిజర్వేషన్లు, రాయితీలు ఇచ్చాము కాబట్టి అందరు ప్రభుత్వం చెప్పిన మాటే వింటారని అనుకున్నారేమో.




ఎక్కడైనా బావే కానీ వంగతోటలో మాత్రం కాదని  ఉద్యోగ, ఉపాధ్యాయసంఘాలు స్పష్టంచేశాయి. పీఆర్సీ వివాదం ముగిసిందని ఉద్యోగుల నేతలు చెప్పినా ఉపాధ్యాయుల సంఘాలు రోడ్డెక్కాయి. వీళ్ళకు కాంట్రాక్టు ఉద్యోగులు తోడవుతున్నారు. అంటే జగన్ ఇక్కడ అర్ధం చేసుకోవాల్సిందేమంటే ఇచ్చింది అన్నీ పుచ్చుకున్నా ఇంకా కావాల్సిన వాటికోసం అవసరమైతే రోడ్డెక్కటానికి మొహమాటపడేది లేదని ఉద్యోగులు తేల్చిచెప్పారు. ప్రభుత్వంలో భాగమైన ఉద్యోగులు, ఉపాధ్యయుల ఆలోచనే ఇలాగంటే ఇక మామూలు జనాల ఆలోచనలు ఇంకెలాగుంటాయి.




కాబట్టి జగన్ అర్జంటుగా గ్రహించాల్సిందేమంటే సంక్షేమ పథకాలతో మాత్రమే జనాలను ఆకట్టుకోలేమని. అంతకుమించి జనాలకు ఇంకేదో కావాలి. నాలుగు కోరికలు తీరగానే ఐదో కోరిక కోరుతారు. ఐదోది తీరగానే ఆరోది కోరుకోవటం మానవ స్వభావం. కాబట్టి  సంక్షేమ పథకాలపైనే కాకుండా అభివృద్ధిపైన కూడా జగన్ దృష్టిపెట్టాలి. పెట్టుబడులు, పరిశ్రమల ఏర్పాటు లాంటివి చేస్తే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. రకరకాల సంక్షేమ పథకాలతో అన్నింటినీ ఇంట్లోకి తీసుకొచ్చి ఇవ్వటం కాకుండా జనాలకు తమ సొంత రెక్కల మీద బతికే మార్గం చూపించాలి. అప్పుడే జనాలు ప్రభుత్వం మీద ఆధారపడటం మానేస్తారు. అర్జంటుగా జగన్ ఈ విషయం మీదే ఫోకస్ పెడితే అందరికీ మంచిది.


మరింత సమాచారం తెలుసుకోండి: