వచ్చే ఎన్నికల్లో పోటీచేసే విషయంలో కొందరు సీనియర్ నేతలు ఇప్పటినుండే ఫ్యామిలి ప్యాకేజీలను మాట్లాడేసుకుంటున్నారా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలో ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వివరాల ప్రకారం నెల్లూరు జిల్లాలోని సీనియర్ ఎంఎల్ఏ ఆనం కుటుంబం ఈ ప్యాకేజీకి రెడీ అవుతోందట.





చాలాకాలంగా వెంకటగిరి ఎంఎల్ఏ ఆనంరామనారాయణరెడ్డి అధికారపార్టీలో ఇమడలేకపోతున్నారు. తొందరలోనే టీడీపీలోకి మారిపోయే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం బాగా జరుగుతోంది. ఇంతలో  ఆత్మకూరు బై ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది. ఈ నేపధ్యంలో హఠాత్తుగా కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలోని బిజివేముల ఆడపడుచు అయిన ఆనం రామనారాయణరెడ్డి కూతురు కైవల్యారెడ్డి ఆత్మకూరు సీటుపై కన్నేశారు. పార్టీ తరపున తాను ఆత్మకూరులో పోటీచేస్తానంటు ఆమె నారా లోకేష్  ను కలిసి బంపర్ ఆఫర్ ఇచ్చారట.




దీంతో నెల్లూరు జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో ఆనంతో పాటు ఆయనకొడుకు చెంచుసుబ్బారెడ్డి, చనిపోయిన మాజీ ఎంఎల్ఏ ఆనం వివేకానందరెడ్డి కొడుకు రంగమమయూర్ రెడ్డి కూడా పోటీకి రెడీ అయిపోతున్నారట. గతంలో ఆనం మీడియాతో మాట్లాడుతు తమ కుటుంబంనుండి కనీసం ముగ్గురు పోటీలో ఉంటారని ప్రకటించారు. అప్పుడు చేసిన ప్రకటన ఇపుడు జిల్లా రాజకీయాల్లో వేడిపుట్టిస్తోంది. అంటే ఆనంతో ఆయన ఫ్యామిలిలోని ఇద్దరు వారసులు, బిజివేముల ఫ్యామిలి తరపున ఆనం కూతురు కూడా పోటీకి రెడీ అయిపోతున్నారు.






బద్వేలులో బిజివేముల ఫ్యామిలి పోటీచేసే అవకాశంలేదు. ఎందుకంటే ఈ నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం. అందుకనే వాళ్ళకన్ను నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరుమీద పడిందనే ప్రచారం పెరిగిపోతోంది. ఎలాగూ ఆనం కుటుంబానికి నెల్లూరు, నెల్లూరు రూరల్, వెంకటగిరి, ఆత్మకూరు, సర్వేపల్లిలో మద్దతుదారులున్నారు. కాబట్టి నలుగురు ఫ్యామిలి ప్యాకేజీకి రెడీ అయిపోతున్నారు. వైసీపీలో అయితే కచ్చితంగా టికెట్లు రావు. మరి టీడీపీ  తరపున ఫ్యామిలి ప్యాకేజీలో పోటీచేస్తారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: