కరోనా ఫోర్త్ వేవ్ గురించి ఇప్పటికీ భయాందోళనలు ఉన్నాయి. ఓవైపు కరోనా దాదాపుగా అంతరించిపోయిందనే వార్తలు వినిపిస్తున్నా.. ప్రజలు మాత్రం కేసులు పెరుగుతుండటంతో ఆందోళన చెందుతున్నారు. తాజాగా ఢిల్లీలో కొత్త వేరియంట్ కలవరపెడుతోంది. ఏకంగా 90మందిలో కరోనా కొత్త వేరియంట్ లక్షణాలు ఉండటంతో, వారికి కొత్త వేరియంట్ నిర్థారణ కావడంతో అటు అధికారులు కూడా హడావిడిపడుతున్నారు. ఇది ఫోర్త్ వేవ్ కి సంకేతమేనా అనే అనుమానాలు కూడా బలపడుతున్నాయి.

దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కరోనా వైరస్‌ అదుపులో ఉన్నా కూడా.. దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం కొద్దిరోజులుగా రోజువారీ కేసుల సంఖ్య 2వేలకు పైగానే నమోదవుతోంది. కరోనా భయంతో ప్రజలు ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. అయితే ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న కేసుల్లో ఒమిక్రాన్ కొత్త వేరియంట్ కనిపిస్తోంది. వీరికి చేసిన వ్యాధి నిర్థారణ పరీక్షల్లో ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్‌ బయటపడినట్లు లోక్‌ నాయక్‌ జయ ప్రకాష్ నారాయణ్‌ ఆసుపత్రి వైద్య వర్గాలు వెల్లడించాయి. వీరిలో కొంతమందిలో వ్యాప్తి రేటు ఎక్కువగా ఉన్న సబ్ వేరియంట్‌ బీఏ 2.75ను గుర్తించారు అధికారులు.

ఈ కొత్త వేరియంట్ టీకా తీసుకున్నా విడిచిపెట్టేలా లేదు. అప్పటికే కరోనా వచ్చి తగ్గిపోయి యాంటీబాడీలు ఉన్నవారినీ కూడా వదలదు. ఢిల్లీలో కరోనా వచ్చినవారిలో అనుమానంతో 90 మంది నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కు పంపించారు అధికారులు. వీరిలో ఒమిక్రాన్‌ సబ్ వేరియంట్‌ బీఏ 2.75ను గుర్తించారు. వీరిలో టీకాలు తీసుకున్నవారు, యాంటీబాడీలు ఉన్నవారు కూడా ఒమిక్రాన్ కి తలొంచక తప్పలేదు. దీంతో ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు వైద్యశాఖ అధికారులు. ఢిల్లీలో ప్రస్తుతం రోజువారీ కేసులు 2వేలకు పైగానే నమోదవుతున్నాయి. గత ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు ఢిల్లీలో రోజువారీ కేసుల సంఖ్య అత్యథికంగా కనిపిస్తోంది. మంగళవారం 2445 కేసులు నమోదయ్యాయి. అక్కడ పాజిటివిటీ రేటు 15.41 కి చేరింది. ఒకరోజులో ఢిల్లీలో కరోనా వైరస్ తో ఏడుగురు చనిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: