మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నిక వ్యవహారాలను బీజేపీ తరపున కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నే స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లుంది. మునుగోడు ఉపఎన్నిక వ్యవహారాలను ఎక్కడో ఢిల్లీలో కూర్చున్న హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యవేక్షించటం ఏమిటి ? రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, సీనియర్ నేతలంతా ఏమయ్యారు ? అన్నదే ఇక్కడ కీలకపాయింట్. చెప్పుకోవటానికి తెలంగాణాలో బీజేపీకి చాలామంది సీనియర్ నేతలున్నారు.





అయితే వీళ్ళందరినీ కాదని అమిత్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారంటేనే ఇక్కడి నేతల్లో సమన్వయలోపం ఉందని అర్ధమైపోతోంది. ఉపఎన్నిక ప్రచారంలోకి ఇంతవరకు బండి దిగలేదు. కిషన్ రెడ్డి కూడా రెండురోజులుగానే ప్రచారం చేస్తున్నారు. సీనియర్లలోని చాలామంది ఇప్పటివరకు నియోజకవర్గంలోకి అడుగే పెట్టలేదు. ఇదే సమయంలో ప్రచారంలో అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డికి చుక్కలు కనబడుతున్నాయి.





నియోజకవర్గంలోని చాలామంది కమలనాదులు రాజగోపాలరెడ్డికి పెద్దగా సహకరించటంలేదు. ఈ విషయాలన్నీ అమిత్ షా దృష్టికి వెళ్ళిందట. అభ్యర్ధికి చాలామంది నేతలతో ఇగో సమస్య ఉందన్న విషయం షా దృష్టికి వచ్చిందట. దీన్ని ఇలాగే కంటిన్యుచేస్తే పార్టీ ఓడిపోవటం ఖాయమని అర్ధమైపోయిందంటున్నారు. అందుకనే నేతలమధ్య సమన్వయం చేయటం, ప్రచారానికి సీనియర్ నేతలను రంగంలోకి దింపటం, ఎన్నికల వ్యవహారాలను సమన్వయం చేయటం తప్పదని భావించి స్వయంగా షానే రంగంలోకి దిగారని పార్టీవర్గాలే చెబుతున్నాయి.





ఢిల్లీనుండే షా ఇక్కడి నేతలందరితో మాట్లాడుతున్నారు. ముఖ్యంగా చౌటప్పల్ మండలంపైన ఎక్కువ దృష్టిపెట్టారట. ఎందుకంటే పార్టీ ఇప్పటికీ పట్టణ ప్రాంతాల్లోనే కానీ గ్రామీణ ప్రాంతాల్లోని జనాల్లో రిజిస్టర్ కాలేదు. చౌటుప్పల్ మండలం హైదరాబాద్ కు బాగా దగ్గరగా ఉండటం వల్ల అర్బన్ వాతావరణం ఎక్కువగా ఉంది. ఈ కారణంగానే మండలంలోని కీలకనేతలతో షా ఫోన్లో మాట్లాడుతున్నట్లు సమాచారం. రాజగోపాల్ వల్ల బీజేపీలోకి వలసలుంటాయని అనుకున్నా పెద్దగా ఫలితం కనబడలేదు. దాంతో అభ్యర్ధి మీదే ఎన్నికను వదిలేస్తే దెబ్బపడటం ఖాయమని సమాచారం అందటంతోనే అమిత్ షా స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు పార్టీలో టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: