వచ్చేఎన్నికల్లో తెలంగాణాలో హ్యాట్రిక్ కొట్టడంతో పాటు ఏపీలో గణనీయమైన ఫలితాలను రాబట్టాలని కేసీయార్ ప్లాన్ చేస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలను చూస్తుంటే కేసీయార్ స్ట్రాటజీ వర్కవుటయ్యే అవకాశాలు ఎక్కువగానే కనబడుతున్నాయి. తెలంగాణాను చూస్తే కాంగ్రెస్ నేతల్లో కుమ్మలాటలు బాగా పెరిగిపోతున్నాయి. కాబట్టి రాబోయే ఎన్నికల్లో వీళ్ళంతా ఐకమత్యంగా కేసీయార్ పైన పోరాటం చేస్తారని ఎవరూ అనుకోవటంలేదు.





ఇక బీజేపీ విషయం చూస్తే పట్టుమని 30 నియోజకవర్గాల్లో కూడా గట్టి అభ్యర్ధులు లేని పార్టీ అధికారంలోకి వచ్చేస్తుందనే భ్రమలు ఎవరిలోను లేదు. బహుశా ఈ విషయంలో కేసీయార్ ఇప్పటికే నియోజకవర్గాల నుండి ఫీడ్ బ్యాక్ తెప్పించుకుని ఉండచ్చు. అందుకనే ఎలాంటి టెన్షన్ లేకుండా  చాలా ప్రశాంతంగా ఉన్నారు. సరే తెలంగాణాను వదిలేసి ఏపీ విషయం చూస్తే ఇక్కడి పరిస్దితులు కూడా బీఆర్ఎస్ కు కాస్త అనుకూలంగానే ఉన్నట్లుంది.





ఎలాగంటే పార్టీల వారీగా చీలిపోయిన ఓటర్లను మినహాయిస్తే న్యూట్రల్ ఓటర్లు వైసీపీ, టీడీపీలతో ఇప్పటికే విసిగిపోయున్నారు. ఇక తన భవిష్యత్తు ఏమిటో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కే తెలీదు. కాపు సామాజికవర్గంలో ఒక సెక్షన్ కు పవన్ను సీఎంగా చూడాలని ఉన్నా ఆ కోరిక పవన్లోనే కనబడటంలేదు. సో, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబునాయుడును వ్యతిరేకించే న్యూట్రల్ ఓటర్లు, జనసేనకు ఓట్లేయటం ఇష్టంలేని ఓటర్లలు బీఆర్ఎస్ కు ఓట్లేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కేసీయార్ భావనగా ఉంది.





ఏపీకన్నా తెలంగాణాలో ఎన్నికలు ముందుగా జరగుతాయి. తెలంగాణాలో కూడా కేసీయార్ హ్యాట్రిక్ కొడితే దాని ప్రభావం ఏపీ ఎన్నికల్లో కూడా పడే అవకాశాలు ఎక్కువగా ఉంది. నరేంద్రమోడీ ప్రభుత్వం ఏపీ ప్రయోజనాలను తుంగలో తొక్కేస్తోందనే మంట జనాల్లో ఎక్కువగా ఉంది. వ్యక్తిగతప్రయోజనాల కారణంగానే జగన్, చంద్రబాబులు మోడీని నిలదీయలేకపోతున్నారు. అదే కేసీయార్ అయితే కేంద్రంపై రెచ్చిపోతున్నారు. ఈ కారణంగా కూడా బీఆర్ఎస్ కు ఓట్లుపడే అవకాశాలున్నాయి. ఇంకేమన్నా అవకాశాలు కూడా కేసీయార్ కు కలిసొస్తాయేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: