వివిధ కారణాలతో అధికారపార్టీలోని కొంతమంది ఎంఎల్ఏలు తమలోని అసంతృప్తని బయటపెడుతున్నారు. అసంతృప్తిని బయటపెట్టకునే విషయంలో వీళ్ళేమీ మొహమాట పడటంలేదు.  ఒకపుడు జగన్మోహన్ రెడ్డంటే ఎంతో భయభక్తులతో ఉన్న ఎంఎల్ఏలే ఇపుడు గొంతపెంచి గట్టిగా మాట్లాడుతున్నారు. వీళ్ళ వైఖరి చూస్తుంటే వచ్చేఎన్నికల్లో వైసీపీ నుండి పోటీచేస్తారా అనే అనుమానాలు అందరిలోను పెరిగిపోతున్నాయి. వెంకటగిరి ఎంఎల్ఏ ఆనం రామనారాయణరెడ్డి వ్యవహారమే ఇందుక తాజా ఉదాహరణ.

ఇదే కోవలో మైలవరం ఎంఎల్ఏ వసంత కృష్ణప్రసాద్ కూడా చేరిపోయినట్లున్నారు. వసంత కూడా పార్టీతో పాటు ప్రభుత్వంపై నోటికొచ్చింది మాట్లాడేస్తున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే గుంటూరు తొక్కిసలాటలో ముగ్గురు చనిపోవటానికి కారకుడైన ఉయ్యూరు శ్రీనివాస్ కు మద్దతుగా నిలబడ్డారు. ఉయ్యూరుపై పోలీసులు కేసు నమోదుచేసి అరెస్టు చేయటాన్ని వసంత తప్పుపట్టారు. మంచిపని చేయాలని అనుకున్న ఉయ్యూరుపై పోలీసులు కేసుపెట్టి అరెస్టు చేయటం ఏమిటంటు రెచ్చిపోయారు.

సేవా కార్యక్రమాలను చేయాలని అనుకుంటున్న వాళ్ళపై కేసులుపెట్టి పోలీసులు అరెస్టు చేస్తుంటే సేవ చేయటానికి ఎవరు ముందుకొస్తారంటు రివర్సులో ప్రభుత్వాన్ని నిలదీయటమే విచిత్రంగా ఉంది. ఎక్కడైనా అవాంఛనీయ ఘటనలు జరిగినపుడు దానికి బాధ్యులైన వాళ్ళపై కేసులుపెట్టడం, అరెస్టు చేయటం మామూలే అన్న విషయం కూడా ఎంఎల్ఏకి తెలియకపోవటమే ఆశ్చర్యంగా ఉంది. ఈమధ్యనే అమరావతి రాజధాని స్ధానంలో మూడురాజధానుల కోసం ప్రయత్నిస్తున్న జగన్మోహన్ రెడ్డిపై వసంత తండ్రి, మాజీమంత్రి వసంత నాగేశ్వరరావు నోటికొచ్చింది మాట్లాడారు.

తర్వాత ఎంఎల్ఏ ఒక కార్యక్రమంలో మాట్లాడుతు చంద్రబాబునాయుడు, లోకేష్ తో తనకేమీ శతృత్వంలేదని ప్రకటించారు. పార్టీలో కూడా టీడీపీ నుండి వచ్చిన వాళ్ళకే ఎంఎల్ఏ అధికప్రాధాన్యత ఇస్తున్నట్లు బాగా ఆరోపణలున్నాయి. మరే నియోజకవర్గంలో లేనట్లుగా తన తరపున నలుగురిని ఇన్చార్జిలుగా నియమించుకున్నారు. ఆ నలుగురు ఎవరంటే పార్టీకి సంబంధంలేని సొంత మనుషులు కావటం కాంట్రవర్సీ అవుతోంది. ఒకవైపు తన తండ్రి జగన్ను టార్గెట్ చేస్తున్నా ఎంఎల్ఏ తనకు సంబంధం లేదంటున్నారే కానీ ఖండించటంలేదు. ఇవన్నీ చూసిన తర్వాత ఎంఎల్ఏ ఏదోరోజు టీడీపీలో చేరటం ఖాయమనే ప్రచారం పెరిగిపోతోంది. చివరకు ఏమిజరుగుతుందో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: