వంగవీటి రాధాకృష్ణ పరిస్ధితి చాలా అయోమయంగా ఉన్నట్లుంది. ఏ పార్టీలో ఉండాలో ఏ పార్టీ తరపున పోటీచేయాలో తేల్చుకోలేకపోతున్నట్లున్నారు. అందుకనే అన్నీపార్టీల నేతలతోను రెగ్యులర్ గా టచ్ లో ఉంటున్నారు. ఒకసారి కొడాలినాని, వల్లభనేని వంశీలతో బాగా సన్నిహితంగా కనిపిస్తారు. మరోసారి జనసేనలో కీలక నేత నాదెండ్ల మనోహర్ తో భేటీ అవుతారు. టీడీపీలోనే ఉన్నా యాక్టివ్ గా అయితే లేరు. అయితే  తాజాగా పాదయాత్రలో ఉన్న నారా లోకేష్ తో పీలేరు నియోజకవర్గం కలికిరి మండలంలో కలిశారు.





మూడు పార్టీలతో సాన్నిహిత్యం మెయిన్ టైన్ చేయటం వల్ల రాధాకు వచ్చే ఉపయోగం ఏమిటో ఆయనకే తెలియాలి. వచ్చేఎన్నికల్లో పోటీచేయాలన్నది రాధా బలమైనే కోరిక. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుండే చేయాలనేది ఇంకా బలమైన కోరిక. వైసీపీలో అది సాధ్యం కాదు.  టీడీపీలో కూడా టికెట్ దొరకటం కష్టమనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ బలమైన నేత బోండా ఉమమహేశ్వరరావు ఉన్నారు. బోండాను కాదని చంద్రబాబునాయుడుకు టికెట్ ఇచ్చేది డౌటే.





ఇక మిగిలింది జనసేన మాత్రమే. ఇక్కడ పోటీ అంటే ఊరికే పోటీచేయటం మాత్రమే కాదు గెలవాలి కూడా. జనసేన తరపున పోటీచేస్తే గెలుపు అనుమానమే. టీడీపీ-జనసేన మధ్య పొత్తుంటే గెలుపు సులభమని అనుకుంటున్నారు. టీడీపీలో ఉంటే టికెట్ దక్కదు కాబట్టి జనసేనలోకి వెళ్ళి పొత్తుల్లో భాగంగా సెంట్రల్ టికెట్ సాధించుకుని రాధా పోటీచేయబోతున్నారని ప్రచారం జరిగింది. ఈనెల 14న పార్టీ ఆవిర్భావ సదస్సు సందర్భంగా జనసేనలో రాధా చేరబోతున్నారనే ప్రచారం అందరికీ తెలిసిందే.






తాజాగా లోకేష్ తో భేటీ సందర్భంగా అధికారంలోకి వస్తే ఎంఎల్సీ ఇస్తామని హామీ ఇచ్చారని వినబడుతోంది. ఇక్కడ గమనించాల్సిందేమంటే రాధాకంటు ప్రత్యేకమైన ఓటు బ్యాంకు లేదు. తండ్రి వంగవీటి రంగా రూపంలో లభించిన బలమైన వేదికను రాధా చెడగొట్టుకున్నారు. ఏదో ఒకపార్టీలో ఉంటే టికెట్ దొరుకుతుందేమో కానీ అన్నీ పార్టీలతోను రెగ్యులర్ గా టచ్ లో ఉండటం వల్ల నష్టమే కానీ లాభం ఉండదని రాధాకు తెలీదా ? రాజకీయాల్లో చాలా సంవత్సరాలుగా ఉన్న రాధాలో ఎందుకీ కన్ఫ్యూజనో అర్ధం కావటంలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: