ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సీన్ మొత్తం మారిపోయింది. తమ విచారణలో స్కామ్ మొత్తం వ్యవహారాలను తనంతట తానుగా అన్నీ బయటపెట్టేశాడని ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చెప్పిన అరుణ్ రామచంద్రపిళ్ళై ఒక్కసారిగా అడ్డం తిరిగాడు.  ఈడీ చెప్పినట్లుగా తమ విచారణలో తాను కల్వకుంట్ల బినామీగా అంగీకరించిన పిళ్ళై తాజాగా తన ప్రకటనను వాపసు తీసుకుంటున్నట్లు కోర్టులో పిటీషన్ వేశారు.

విచిత్రంగా కోర్టు కూడా పిళ్ళై పిటీషన్ను అడ్మిట్ చేసుకుని ఈ మేరకు కౌంటర్ దాఖలు చేయాలని ఈడీకి నోటీసులు ఇవ్వటమే ఆశ్చర్యంగా ఉంది. తమ విచారణలో కవితకు తాను బినామీని అని, తన ఇండోస్పిరిట్ కంపెనీలో కవితకు 32.5 శాతం వాటా ఉందని పిళ్ళై చెప్పినట్లు ఈడీ రిమాండ్ రిపోర్టులో  కోర్టుకు చెప్పింది. లిక్కర్ స్కామ్ లో తాను కవిత తరపునే పనిచేస్తున్నట్లు పిళ్ళై అంగీకరించాడని కూడా చెప్పింది. తాను చెప్పాడు కాబట్టే రిమాండ్ రిపోర్టులో ఈడీ కవిత పేరును ప్రస్తావించినట్లు స్పష్టంగా చెప్పింది.

పిళ్ళై ఇపుడు అడ్డం తిరగటంతో ఈడీ జుట్టుపీక్కుంటోంది. పిళ్ళై వాగ్మూలం ఆధారంగానే కవితను విచారించేందుకు నోటీసులు ఇచ్చింది. శనివారం ఢిల్లీలోని ఆఫీసులోనే కవితను ఈడీ విచారించబోతోంది. నిజానికి ఈడీ విచారణ అనగానే కవిత అరెస్టు ఖాయమనే ప్రచారం విపరీతంగా జరిగిపోతోంది. పార్టీ మీటింగులో కేసీయార్ మాట్లాడుతు ఈడీ కవితను అరెస్టుచేసే అవకాశముందని చెప్పటం గమనార్హం. మరి కేసీయార్ కు ఏమి సమాచారం ఉందో తెలీదు.

అరెస్టును ఎదుర్కోవటానికి కేసీయార్+బీఆర్ఎస్ నేతలంతా రెడీ అవుతున్నారు. సరిగ్గా ఈ సమయంలోనే పిళ్ళై అడ్డం తిరగటంతో శనివారం కవిత విచారణలో ఏమి జరగబోతోందనే ఉత్కంఠ పెరిగిపోతోంది. తాజా డెవలప్మెంట్ల ఆధారంగా ఈడీ తనను విచారించేందుకు లేదని కవిత కోర్టులో పిటీషన్ వేసినా ఆశ్చర్యంలేదనే వాదన కూడా వినబడుతోంది. స్కామ్ లో కవితకు అసలు సంబంధమే లేదని గనుక తేలిపోతే ఇప్పటికే అరెస్టయిన వాళ్ళపైన ఉన్న కేసులు కూడా తేలిపోయే అవకాశముంది. ఎందుకంటే స్కామ్ కు పాల్పడిన సౌత్ గ్రూప్ లో కవితే కీలకమని ఈడీ అంటోంది.  అలాంటిది కవితకే సంబంధంలేదనంటే ఇక మిగిలిన వాళ్ళకు మాత్రం సంబంధం ఏముంటుంది ?

మరింత సమాచారం తెలుసుకోండి: