మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి ఇదే చివరి అవకాశంగా పార్టీలో చర్చ జరుగుతోంది. బాలినేని అలగటం, పార్టీలో కీలకవ్యక్తులను బుజ్జగించమని పుమాయించటం రెగ్యులర్ గా జరుగుతోంది. కీలక నేతల స్ధాయిలో బుజ్జగింపులు సర్దుబాబు కాక చివరకు జగన్మోహన్ రెడ్డే రంగంలోకి దిగటం మామూలైపోయింది. బాలినేని వ్యవహారశైలితో జగన్ ఇప్పటికే బాగా విసిగిపోయున్నారట. బాలినేని అలిగి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం, జగన్ పిలిపించి మాట్లాడటం ఇది మూడోసారి.

గురువారం సాయంత్రం కూడా దాదాపు గంటసేపు బాలినేనితో చర్చలకు జగన్ కేటాయించారు. గతంలో కూడా ఇలాగే అర్ధగంట, గంటసేపు బుజ్జగించినా బాలినేని వైఖరిలో ఎలాంటి మార్పురాలేదు. చీటికి మాటికి అలగటం. తనకు స్వయంగా బావైన టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో గొడవలు పడటంతో దాని ప్రభావం పార్టీ మొత్తంపైన పడుతోంది. బావ-బావమరుదల మధ్య గొడవలు ఏమిటో తెలీదుకానీ ఏరోజు వైవీ మాత్రం ఈ విధంగా అలిగి, పార్టీకి దూరంగా ఉండి అందరి దృష్టిని ఆకర్షించాలని అనుకోలేదు.

అయితే బాలినేనికి ఇది బాగా అలవాటైపోయింది. జగన్ తో భేటీ తర్వాత మీడియాతో ఉత్సాహంగానే మాట్లాడుతారు మళ్ళీ తన పద్దతిలోనే వెళతారు. బాలినేనిని వదులుకోవటం ఇష్టంలేకే జగన్ ఇదంతా భరిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తనకు జగన్ ఎంతటి ప్రాధాన్యతిస్తున్నారు ? తాను జగన్ కు ఎంత సన్నిహితుడిని అని అందరికీ చెప్పుకోవటం కోసమే బాలినేని ఇలాంటి ఎత్తుగడులు వేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.
నిజానికి ఒక్కోనేత ఇన్నిసార్లు అలగటం, వాళ్ళని పిలిపించి మాట్లాడటం జగన్ నైజంకాదు. అయితే బాలినేని విషయంలోనే ఇలా జరుగుతోంది. దీన్ని బాలినేని గనుక అలుసుగా తీసుకుంటే మొదటికే మోసం వస్తుందని పార్టీలో చర్చ జరుగుతోంది. ఇచ్చిన ప్రాధాన్యతను జాగ్రత్తగా వాడుకోకపోతే పార్టీనుండి బయటకు పంపేయటానికి కూడా జగన్ ఏమాత్రం సంకోచించరని నేతలంటున్నారు. గతంలో సబ్బంహరి విషయంలో జరిగిందాన్ని పార్టీవర్గాలు గుర్తుచేస్తున్నాయి. అందుకనే బాలినేనికి ఇదే చివరి చాన్సుగా నేతలంటున్నారు. పద్దతిగా ఉంటే బాలినేని ప్రాధాన్యతకు ఎలాంటి డోకా ఉండదని కానీ ప్రతిచిన్న విషయాన్ని పెద్దదిగా చూపించి లబ్దిపొందాలని చూస్తే మాత్రం మొదటికే మోసం తప్పదంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: