తమిళనాడుపై ప్రకృతి పగబట్టినట్టే కనిపిస్తోంది. మొన్నటికి మొన్న దాదాపు నెలరోజులపాటు ఎడతెరిపిలేని వర్షాలు ఆ రాష్ట్రాన్ని వరదల్లో ముంచెత్తాయి. చెన్నై వంటి మహానగరం వరదలతో అతలాకుతలమైంది. 3, 4 రోజులు కాదు ఏకంగా నెలరోజులకుపైగా చెన్నై నీళ్లలోనానింది. ఆ వరదల నుంచి ఇప్పుడిప్పుడే కుదటపడుతున్న తమిళనాడు వాసులను ఇప్పుడు సునామీ భయం వణికిస్తోంది. 

తమిళనాడుకు సునామి ముప్పు పొంచి ఉందంటూ ఆదివారం నేషనల్ మ్యారీటైమ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ హెచ్చరికలు జారీ చేసింది. కన్యాకుమారి జిల్లాలోని తీర ప్రాంతాల్లో 8 నుంచి 10 అడుగుల ఎత్తులో రాకాసి అలలు ఎగిసిపడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అలల తీవ్రత రెండు, మూడు రోజులు ఉండొచ్చని అంచనా వేసింది. గంటకు 60 కిలోమీటర్లవేగంతో ఈదురుగాలులు వీయవచ్చట. 

ఇప్పటికే కన్యాకుమారి వద్ద నీటి మట్టం పెరిగిందట. భారత భూభాగం చివరి అంచుగా చెప్పుకునే వివేకానందస్వామి, తిరువళ్లువర్ విగ్రహాల సందర్శన నిలిపేశారట. సముద్రంలోకి చేపల వేట కూడా నిషేధించారట. ఈ సంకేతాలు గమనించిన అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారట. తమిళనాడు తీరాన్ని సరిగ్గా 11 ఏళ్ల క్రితం ఇదే డిసెంబర్ లోనే మరోసారి సునామీ హెచ్చరికలు వచ్చాయి. 

గతంలో 2014 డిసెంబర్లో వచ్చిన సునామీ తమిళతీరాన్ని చిగురుటాకులా వణికించింది. వందల మంది ఆ సునామీలో ప్రాణాలు కోల్పోయారు. ఎటుచూసినా శవాల గుట్టలు కనిపించిన ఈ బీభత్సాన్ని ఇటీవలే తమిళ ప్రజలు గుర్తు చేసుకున్నారు. సునామీ మృతులకు సంతాప సూచకంగా ర్యాలీలు తీశారు. ఈ నేపథ్యంలో మరోసారి సునామీ హెచ్చరికలు రావడంతో తీరంలోని  తమిళతంబీలు బెంబేలెత్తిపోతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: