అసెంబ్లీ సమావేశాల ముందు జరిగిన కేబినెట్ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో ప్రధానంగా విమానాశ్రయాల పేర్ల మార్పు, కీలక బిల్లులకు ఆమోదం, కొత్త చట్టాల ఏర్పాటుపై నిర్ణయాలు తీసుకున్నారు. కృష్ణా జిల్లా పెనుగంచి ప్రోలు వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందినవారికి సంతాపం తెలియచేస్తూ తీర్మానం చేశారు.
అమరావతిలోని గన్నవరం విమానాశ్రయానికి ఎన్టీఆర్ అమరావతి విమానాశ్రయంగా పేరు మారుస్తారట. తిరుపతి విమానాశ్రయానికీ శ్రీవెంకటేశ్వరా విమానాశ్రయంగా పేరును మారుస్తారట. ఈ మేరకు ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపాలని నిర్ణయించారు. దీంతో పాటు ఏపీలో మూడు యూనివర్శిటీలో నిర్మించాలని నిర్ణయించారు. ఈ మేరకు బిల్లులు రూపొందిస్తారు.
ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్ యూనివర్సిటీని కాకినాడ కేంద్రంగా ఏర్పాటు చేస్తారు. 300 కోట్లతో 90 ఎకరాల్లో నిర్మించాలని ప్రతిపాదించారు. అటు అనంతపురం జిల్లా పెనుగొండలో ఇంధన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసేలా బిల్లును ప్రవేశపెడతారు. సముద్రయాన విశ్వవిద్యాలయాన్ని కూడా ఏర్పాటు చేస్తారు. అమరావతిలో సవీతీ విశ్వవిద్యాలయానికి 75 ఎకరాలను కేటాయించేందుకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఇక కొత్త చట్టాల విషయానికి వస్తే.. నకిలీవిత్తన కంపెనీల పనిపట్టేందుకు విత్తన చట్టానికి చట్టబద్ధత కల్పించాలని ఏపీ మంత్రివర్గం తీర్మానించింది. డిపాజిట్లు సేకరించే ఆర్ధిక సంస్థలకు సంబంధిచిన బిల్లులో సవరణలు తెచ్చేందుకూ కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఎగవేతదార్లకు చెందిన ఆస్తుల స్వాధీనం, వేలం వేసేందుకు ఈ చట్టం ద్వారా వెసులుబాటు కలిగేలా సవరణలు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది.
ఆంధ్రప్రదేశ్ తీరంలో పోర్టుల ఏర్పాటు, సముద్ర తీర ఆధారిత అభివృద్ధి కోసం ఏపీ మారిటైమ్ బోర్డు బిల్లును పెట్టేందుకు కూడా మంత్రివర్గం ఆమోదాన్ని తెలిపింది. కర్నూలు జిల్లా ఓర్వకల్లు గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు కమిటీ లిమిటెడ్ కోసం బేసిక్ రేటుకే భూమి ఇస్తారు. ఎక్సైజు శాఖలోని కొన్ని సెక్షన్లకు సవరణ ప్రతిపాదనలకూ మంత్రివర్గం ఆమోదాన్ని తెలిపింది.