ఢిల్లీ పర్యటనలో చంద్రబాబునాయుడు చిత్ర విచిత్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. అసలు ఢిల్లీకి వెళ్ళిందే నరేంద్రమోడి మీద యుద్ధం ప్రకటించటానికే కదా. ముందుగా అనుకున్న ప్రకారమే చంద్రబాబు తన అజెండాను అమలు చేశారులేండి. ఇంతకీ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలేమిటి ? ఏమిటంటే, దేశంలోని అన్నీ వ్యవస్ధలను చంద్రబాబు ధ్వంసం చేసేశారట. ప్రశ్నించినవారిపై ఆదాయపు పన్ను శాఖ, సిబిఐ, ఈడీలతో దాడులు చేయిస్తున్నారట. తాను న్యూఢిల్లీలో మోడికి వ్యతిరేకంగా మాట్లాడితే కనీసం ఒక్క జాతీయ చానల్ లో కూడా ప్రస్తావించలేదని బోల్డు బాధపడిపోయారు. మీడియాను మోడి సర్కార్ దారుణంగా మేనేజ్  చేస్తోందంటూ నానా శాపనార్ధాలు పెట్టారు.

 

ప్రత్యర్ధి రాజకీయపార్టీల మద్దతుదారులను, ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందనుకున్న అభ్యర్ధులను బెదిరిస్తున్నట్లు తీవ్రంగా మండిపడ్డారు. తమ పార్టీ ఎంపిలపై ఐటి దాడులు చేయిస్తున్నారంటూ ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో అసలు బెదిరింపులు తగునా ? అంటూ అమాయకంగా ప్రశ్నించేశారు. రాఫెల్ యుద్ద విమానాల కొనుగోలుపై ఆరోపణలు వచ్చినపుడు వివరాలు బహిర్గతం చేయకుండా రహస్యమని చెప్పటాన్ని ఆక్షేపించేశారు.

 

ఇలా..చాలానే చెప్పారు చంద్రబాబు. అందుకే అంటుంటారు వినేవాళ్ళు వెర్రోళ్ళయితే చెప్పేవాడు చంద్రబాబు అని. మోడిపై తాను ఎన్ని నిందలైతే వేశారో అవన్నీ తనకూ వర్తిస్తాయని మరచిపోయినట్లు నటిస్తున్నారు. ఏపిలో మీడియా నిష్పాక్షికంగా వ్యవహరిస్తోందా ? మీడియాలో 90 శాతం చంద్రబాబుకు బాకాలూదుతున్నవే కదా ? ప్రతిపక్షాల గొంతును ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి విషయంలో మెజారిటీ మీడియా ఏ విధంగా వ్యవహరిస్తోందో తెలీంది ఎవరికి ? మోడికి వ్యతిరేకంగా మాట్లాడితే ఒక్క మీడియా కూడా ప్రస్తావించలేదని అంటున్నారు. రాష్ట్రంలో జగన్ ఎప్పటి నుండో మొత్తుకుంటున్నది అదే కదా ?

 

ఇక, రాజకీయ పార్టీల మద్దతుదారులను, ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉన్న అభ్యర్దులను మోడి ప్రభుత్వం బెదిరిస్తోందట. విచిత్రంగా లేదు చంద్రబాబు అభియోగం ? ఆమధ్య జరిగిన స్దానిక సంస్దల కోటా ఎంఎల్సీ ఎన్నికల్లో చంద్రబాబు చేసిందేమిటి ? వైసిపికి మెజారిటీ ఉన్న నెల్లూరు, కర్నూలు, కడప జిల్లాల్లో ఎంఎల్సీలను టిడిపి ఎలా గెలుచుకుందో అందరికీ తెలిసిందే. ప్రజాస్వామ్యం గురించి మోడికి బుద్ధులు చెబుతున్న చంద్రబాబు పోయిన ఎన్నికల్లో వైసిపి తరపున గెలిచిన 23 మంది ఎంఎల్ఏలను, ముగ్గురు ఎంపిలను టిడిపిలోకి ఎలా లాక్కున్నారు ?

 

ఇక, రాఫెల్ యుద్ద విమనాల కొనుగోలులో రహస్యాలేంటని నిలదీయటం విడ్డూరంగానే ఉంది. ఎందుకంటే,  పెట్టుబడులు తెస్తామని విదేశాల్లో తిరిగిన చంద్రబాబు, లోకేష్ కు అయిన ఖర్చుల వివరాలు కావాలంటే కుదరదని చంద్రబాబు ప్రభుత్వమే సమాధానం చెప్పిన సంగతి అందరికీ  గుర్తుండే ఉంటుంది.  అమరావతి నిర్మాణం విషయంలో సింగపూర్  సంస్ధలతో కుదుర్చుకున్న ఎంవోయు వివరాలు చెప్పమని అడిగితే కుదరదుపొమ్మని చెప్పిందెవరు ? సమాచార హక్కు చట్టం క్రింద అడిగితే అదంతా కాన్ఫిడెన్షియల్ అని తిరస్కరించెందెవరో ? ప్రజాధనంతో చంద్రబాబు, లోకేష్ ఎంచక్క విదేశాల్లో చక్కర్లు కొట్టిరావచ్చు. వాళ్ళ విదేశీ పర్యటనల వల్ల రాష్ట్రానికి జరిగిన మేలేమిటి ? అని మాత్రం అడక్కూడదా ? అడిగితే వాళ్ళు ప్రజాద్రోహులు, అభివృద్ధి నిరోధకులని ఎదరుదాడి చేసిన విషయం చంద్రబాబు మరచిపోయారేమో ? మొత్తానికి చంద్రబాబు విషయం గురివిందగింజ నీతిని గుర్తుకు తెస్తోంది కదూ ?


మరింత సమాచారం తెలుసుకోండి: