రాష్ట్రంలో గోదావరి నది పరవళ్లు తొక్కుతోంది. ఎగువ నుంచి కురుస్తున్న వర్షాలకు తోడు తెలుగు రాష్ట్రాల్లోనూ కొన్నిరోజులుగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరి వరద ఉధృతమైంది. గోదావరికి వరద వచ్చినప్పుడు లంక గ్రామాల్లో పరిస్థితులు దారుణంగా ఉంటాయి.


లోతట్టు ప్రాంతాలు మునిగిపోతుంటాయి. మత్స్యకారుల పనిముట్లు నీటిపాలవుతుంటాయి. ఏపీలో ఉధృతం దాల్చిన గోదావరి పరిస్థితిపై సహాయ చర్యలను ముమ్మరం చేసేందుకు వైసీపీ మంత్రులు రంగంలోకి దిగారు. పశ్చిమగోదావరి జిల్లా పోలవరం వరద పరిస్థితిపై ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి తానేటి వనిత జిల్లా అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.


పోలవరం వరద ప్రవాహం క్రమేపి తగ్గుతోందని... శుక్రవారానికి వరద పూర్తి స్థాయిలో తగ్గుముఖం పడుతుందని పశ్చిమగోదావరి జిల్లా ఇంచార్జి మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ తెలిపారు. ఆయన కూడా సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. పోలవరం ఎగువ నున్న 19 గ్రామాలకు మూడు నెలలకు సరిపడా నిత్యావసర వస్తువుల సరఫరా చేశామని మంత్రి పిల్లి సుభాష్ చంద్ర బోస్ తెలిపారు.


పోలవరంలో మూడు, వేలేరుపాడు లో రెండు గ్రామాలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.ఆయా గ్రామాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టామని మంత్రి మీడియాకు తెలిపారు. ప్రస్తుతం ఎగువ కాపర్‌ డ్యామ్‌ వద్ద గోదావరి వరద 26 మీటర్లు ఉంది. దీని వల్ల కాపర్‌ డ్యామ్‌కు ఎటువంటి భయం లేదని అధికారులు చెబుతున్నారు. వరద గ్రామాల్లో వైద్య శిబిరాలు, పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు.


వైద్యులు, పోలీసులు, రెవెన్యూశాఖ అధికారులు అన్ని గ్రామాల్లో అందుబాటులో ఉంచామని మంత్రులు తెలిపారు. సమీక్ష అనంతరం మంత్రులు ప్రత్యేక లాంచీలో కొండ్రుకోట వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లారు. మంత్రుల పర్యటనతో సహాయ చర్యలు ఊపందుకోనున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: