గోదావరిలో బోటు ప్రమాదం ఘటన తెలుగు రాష్ట్రాల్లో పెను విషాదం నింపింది. దాదాపు 50 మంది వరకూ ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ ప్రమాదానికి గురైన లాంచీ ఇంకా నీటిలోపలే ఉంది. ఇంకా కనీసం 14 మంది ఆచూకీ తెలియడం లేదు. తమ వారు బతికి ఉన్నారో లేదో తెలియని పరిస్థితి. కనీసం శవాన్ని కూడా చూసుకోలేదని దయనీయ స్థితి.


అయితే ఈ అంశంపైనా రాజకీయాలు చేయడం విస్తుగొలుపుతోంది. ఈ అంశంపై ఇప్పటికే చంద్రబాబు వంటి నేతలు విమర్శలు చేశారు. ఇన్ని రోజులైనా బోటు తీయకపోవడం ప్రభుత్వ అసమర్థత అంటూ ఘాటుగా మాట్లాడారు. కొన్ని సంస్థలు బోటు తీస్తామని వస్తున్నా.. ప్రభుత్వం అనుమతించడం లేదని అన్నారు. ఈ ప్రభుత్వానికి బోటు తీయడం ఇష్టం లేదని మరికొందరు నేతలు అంటున్నారు.


అయితే ఈ విమర్శలపై వైసీపీ ప్రభుత్వం ఘాటుగా స్పందించింది. బోటు బయటకు తీస్తామంటూ చాలా మంది వస్తున్నారని, ఎవరైనా బయటకు తీస్తామంటే ప్రభుత్వం సహకారం అందిస్తుందని మంత్రి కన్నబాబు చెప్పారు. ఈ విషయంపై ప్రతిపక్ష నేతలు అనవసరమైన విమర్శలు మానుకోవాలన్నారు. బోటు మునక ఘటనపై విచారణ కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు.


శుక్రవారం సాయంత్రం సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కన్నబాబు మాట్లాడారు. బోటు ప్రమాదం దురదృష్టకరమైన సంఘటన అని మంత్రి కన్నబాబు అన్నారు. దేవిపట్నంలో బోటు బోల్తా ఘటనపై విచారణ కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా కమిటీ వేస్తామని తెలిపారు. బోటును బయటకు తీయడం సంక్లిష్టంగా మారిందని పేర్కొన్నారు. బోటును బయటకు తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు.


దేశంలో ఇంతవరకు ఇంత లోతులో ఉన్న లాంచీని ఎప్పుడు చూడలేదన్నారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని, రాజకీయాల కోసం ప్రతిపక్ష నేతలు విమర్శలు మొదలుపెట్టారని ఫైర్‌ అయ్యారు. చంద్రబాబు శవాలతో రాజకీయం చేయడం మానుకోవాలని సూచించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: