తెలంగాణలో కేసీఆర్ ఆర్టీసీ సమ్మె కారణంగా రాజకీయంగా ఇబ్బందిపడుతున్నారు. ఆర్టీసీ సమ్మె మొదలై నెలరోజులు కావస్తున్నా ఓ కొలిక్కిరాలేదు. అసలు కార్మికుల మాట వినేది లేదని మొదట్లో భీష్మించుకున్న కేసీఆర్ పరిస్థితి రోజురోజుకూ ఇబ్బంది కరంగా తయారవుతోంది. అన్నివైపుల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది.


సాక్షాత్తూ సీఎం డెడ్ లైన్లు పెడుతున్నా ఆర్టీసీ కార్మికులు బెదరడం లేదు. ఉద్యోగాల్లో చేరడం లేదు. ఓవైపు ఆర్టీసీ సమ్మె సమస్యతో కేసీఆర్ సతమతమవుతుంటే.. మరో పక్క జగన్ కేసీఆర్ పుండు మీద కారం జల్లే పని చేస్తున్నాడు. ఆంధ్రాలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేసిన జగన్ ఆ ప్రక్రియ మరింత వేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు.


రోడ్లు, భవనాల శాఖ సమీక్షలో సీఎం వైయస్‌ జగన్‌ పలు విషయాలపై సంబంధిత శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్, అధికారులతో చర్చించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు చేయాల్సిన చట్ట సవరణలకు సీఎం అంగీకారం తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తయితే ఇక ఏపీఎస్ ఆర్టీసీ అనేది పూర్తిగా ప్రభుత్వంలో విలీనం అవుతుంది. ఉద్యోగుల కలనెరవేరుతుంది.


ఇదే సమీక్షలో జగన్ మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్‌ను సత్వరమే పూర్తిచేయాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో దెబ్బతిన్న రోడ్లను వెంటనే గుర్తించాలని సీఎం ఆదేశించారు. రోడ్ల మరమ్మతు పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని, పనుల కోసం రూ.625 కోట్లు మంజూరు చేశారు.


అదే విధంగా అమరావతి – అనంతపురం ఎక్స్‌ప్రెస్‌వేపై ముఖ్యమంత్రి సమీక్షించారు. అమరావతి – అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ వే కోసం భూసేకరణపై దృష్టిపెట్టి పనులు ప్రారంభమయ్యేలా చూడాలన్నారు. ఎక్స్‌ప్రెస్‌వేను చిలకలూరిపేట బైపాస్‌కు అనుసంధానం చేసే ప్రతిపాదనకు సీఎం వైయస్‌ జగన్‌ అంగీకారం తెలిపారు. గుండుగొలను – గొల్లపూడి – కలపర్రు – మంగళగిరి బైపాస్‌ పనులపై చర్చించారు. అవసాన దశలో ఉన్న 676 బ్రిడ్జిలను ఎన్డీబీ ప్రాజెక్టులో పెట్టాలని ఆదేశించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: