రాజ‌కీయాల్లో ఎప్పుడు ఎలాంటి ప‌రిణామాలు ఎదుర‌వుతాయో చెప్ప‌లేం. వ్యూహాత్మకంగా అడుగులు వేసే వారికి కూడా ఎదురీత లు త‌ప్ప‌ని విధంగా రాజ‌కీయాలు మారిపోయాయి. ఒక్క స్టెప్‌.. ఒకే ఒక్క స్టెప్‌.. నాయ‌కుల త‌ల‌రాత‌ల‌ను మార్చేసిన సంద‌ర్భాలు అనేకం ఉన్నాయి. ఇలాంటి వారిలో సీనియ‌ర్ పొలిటిక‌ల్ దిగ్గ‌జం దాడి వీర‌భ‌ద్ర‌రావు ఒక‌రు. టీడీపీలో సీనియ‌ర్ నాయ‌కుడిగా, అన్న‌గారు ఎన్టీఆర్ ద‌గ్గ‌ర మంచి మార్కులు సంపాయించుకున్న ప్ర‌ముఖ విమ‌ర్శ‌కుడిగా కూడా పేరు తెచ్చుకు న్న దాడి.. ఇప్పు డు రాజ‌కీయంగా అవాంత‌రాల సుడిలో చిక్కుకున్నారు. ఎలాంటి గుర్తింపు లేకుండా ఇబ్బంది ప‌డుతున్నారు.


టీడీపీలో ప్ర‌స్థానాన్ని ప్రారంభించిన దాడి వీర‌భ‌ద్ర‌రావు.. 1989 నుంచి వ‌రుస‌గా టీడీపీ త‌ర‌ఫున అన‌కాప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో పోటీ చేసి విజ‌యం సాధించారు. టీడీపీలో ఏర్ప‌డిన రాజ‌కీయ మార్పులో భాగంగా ఆయ‌న చంద్ర‌బాబుకు జై కొట్టారు. ఈ క్ర‌మం లో ఆయ‌న‌కు కూడా చేరువ‌య్యారు. స‌మ‌యానికి త‌గిన విధంగా పార్టీకి సేవ‌చేస్తూ.. అధినేత దృష్టిలో ప‌డ్డారు. అయితే, 2004, 2009 ఎన్నిక‌ల్లో ఆయ‌న టీడీపీ త‌ర‌ఫునే పోటీ చేసినా.. అప్ప‌టి వైఎస్ హ‌వా ముందు నిల‌వ‌లేక పోయారు. ఆ రెండు ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న ఘోరంగా ఓట‌మిపాల‌య్యారు. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు ఆయ‌న‌కు ఎమ్మెల్సీ ప‌ద‌విని ఆఫ‌ర్ చేశారు. ఇలా ఉండ‌గానే ఆయ‌న రాజ‌కీయంగా సాహ‌సోపేత‌మైన అడుగు వేశారు.


అదే, టీడీపీని వీడి వైసీపీలోకి చేరిపోవ‌డం. నిజానికి రాజ‌కీయాల్లో ఇలాంటి మార్పులు కూడా స‌హ‌జమే. అయితే, ఆయ‌న వైసీపీలోకి చేరే ముందు అతిగా ఊహించుకున్నార‌ని అంటారు ప‌రిశీల‌కులు. 2014లో ఎట్టి ప‌రిస్తితిలోనూ జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చేస్తార‌నే అతి విశ్వాసం పెట్టుకున్న నాయ‌కుల్లో ఉత్త‌రాంధ్ర‌లో దాడి స్ప‌ష్టంగా క‌నిపించారు. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ ద‌గ్గ‌ర మార్కులు కొట్టేసేందుకు ఆయ‌న చంద్ర‌బాబుపై విరుచుకుప‌డ్డారు. అయితే, ప్ర‌జ‌లు చంద్ర‌బాబుకు అధికారం అప్ప‌గించ‌డం, వైసీపీలోనూ దాడికి త‌గిన గుర్తింపు ల‌భించ‌క‌పోవ‌డంతో మ‌ధ్య‌లోనే ఆయ‌న మ‌ళ్లీ వైసీపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబుకు మ‌ళ్లీ జై కొట్టారు.


అయితే, ఈ ద‌ఫా చంద్రబాబు ఆయ‌న‌ను పార్టీలోకి తీసుకున్నా..ఎలాంటి బాధ్య‌త‌లు అప్ప‌గించ‌లేదు. ఎలాంటి నామినేటెడ్ ప‌ద‌వులు కూడా అప్ప‌గించ‌లేదు. అయినా విధిలేని ప‌రిస్థితిలో పార్టీలోనే కొన‌సాగారు. అయితే, మ‌ళ్లీ దాడి మ‌రో స్టెప్ వేశారు. ఎన్నిక‌ల‌కు ఏడాది స‌మ‌యం ఉంద‌న‌గానే ఆయ‌న వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. త‌న కుమారుడిని రాజ‌కీయంగా పైకి తీసుకురావాల‌ని ప్ర‌య‌త్నించారు. అయితే, ఇది కూడా సాధ్యం కాలేదు. పార్టీలో చేర్చుకున్న‌ప్ప‌టికీ.. దాడికి జ‌గ‌న్ టికెట్ కేటాయించ‌లేదు.. దీంతో మ‌ళ్లీదాడి ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లిన‌ట్ట‌యింది. ఇక‌, ఈలోగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎన్నిక‌ల‌కు ముందు దాడి ఇంటికి స్వ‌యంగా వెళ్ల‌డం, ఆయ‌న‌కు విందు ఇవ్వ‌డం వంటివి కూడా సంచ‌ల‌నంగా మారాయి.


దీంతో ఇక‌, దాడి జ‌న‌సేన‌లో చేరుతున్నా ర‌నే వ్యాఖ్య‌లు వినిపించాయి. క‌ట్ చేస్తే.. వైసీపీ అదికారంలోకి వ‌చ్చింది. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు దాడి ప్ర‌స్థావ‌న ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. అటు ఎమ్మెల్సీగానో.. నామినేటెడ్ ప‌ద‌వుల్లోనో ఆయ‌న‌ను నిమించే అవ‌కాశం కానీ, నియ‌మించాల‌నే ప్ర‌తిపాద‌న కానీ ఎక్క‌డా క‌నిపించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. మొత్తంగా దాడి రాజ‌కీయ ఫ్యూచ‌ర్ తీవ్ర గంద‌ర‌గోళంలో ప‌డింద‌నే వ్యాఖ్య‌ల‌కు బ‌లం చేకూరుతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: