టీడీపీ అధినేత చంద్ర‌బాబు సొంత జిల్లా చిత్తూరులోని చిత్తూరు పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం ప‌రిస్థితి ఏంటి? ఇక్క‌డ పార్టీ ప‌రిస్థితి ఏంటి?  కార్య‌క‌ర్త‌ల ప‌రిస్థితి ఏంటి? అనే ప్ర‌శ్న‌లు వ‌రుస‌గా తెర‌మీదికి వ‌స్తున్నాయి. దీనికి కార‌ణం.. ఇక్క‌డ నుంచి వ‌రుస‌గా రెండు సార్లు 2009, 2014 ఎన్నిక‌ల్లో గెలిచి ప్రాతినిధ్యం వ‌హించిన ఎంపీ నారిమిల్లి శివ‌ప్ర‌సాద్ రెండు మాసాల కింద‌ట అనారోగ్యం కార‌ణంగా మృతి చెందారు. ఈ ఏడాది ఏప్రిల్లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఆయ‌న ఓట‌మి పాల‌య్యారు. ఆ త‌ర్వ‌త ఆయ‌న అనారోగ్యంతో ఆసుప‌త్రిలో చేర‌డం మృతి చెంద‌డం తెలిసిందే. అయితే, ఇప్ప‌డు ఇక్క‌డ పార్టీని న‌డిపించేందెవ‌రు? అనే ప్ర‌శ్న తెర‌మీదికి వ‌చ్చింది.


శివ‌ప్ర‌సాద్‌కు కుమారులు లేక పోవ‌డంతో ఆయ‌న త‌న అల్లుడు న‌ర‌సింహ‌ప్ర‌సాద్‌ను రాజ‌కీయ వార‌సుడిగా ప్ర‌క‌టించారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఎమ్మెల్యే టికెట్ కూడా ఇప్పించుకున్నా.. జ‌గ‌న్ సునామీ ముందు నిల‌వ‌లేక పోయారు. స‌రే! ఇప్పుడు ఈ నియోజ‌క‌వ‌ర్గానికి న‌ర‌సింహ ప్ర‌సాద్‌ను ఇంచార్జ్‌గా నియ‌మిస్తారా?  లేక కొత్త‌వారిని వెతుకుతారా? అనే ప్ర‌శ్న ఉద‌యిస్తోంది. ఏదేమైనా .. శివ‌ప్ర‌సాద్ మ‌ర‌ణం జ‌రిగి రెండు మాసాలు పూర్త‌యినా.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి నిర్ణ‌యం తీసుకోక‌పోవ‌డంతో పార్టీ శ్రేణులు తీవ్ర గంద‌ర‌గోళంలో ఉన్నాయి. ఇక‌, నియోజ‌క‌వ‌ర్గం ప‌రిస్తితిని గ‌మ‌నిస్తే.. ఈ పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో మొత్తం ఏడు నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి.


న‌గ‌రి, కుప్పం, ప‌ల‌మ‌నేరు, చంద్ర‌గిరి, గంగాధ‌ర‌నెల్లూరు(ఎస్సీ), చిత్తూరు, పూత‌ల‌ప‌ట్టు(ఎస్సీ) ఉన్నాయి. ఈ ఏడాది జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కేవ‌లం ఒక్క కుప్పంలో(చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం) త‌ప్ప మిగిలిన చోట్ల టీడీపీ ప‌డ‌కేసింది. వాస్త‌వానికి చిత్తూరు, కుప్పంల‌లో త‌ప్ప 2014లోనూ టీడీపీ గెలుపు గుర్రం ఎక్క‌లేదు. ప‌ల‌మ‌నేరులో 2014లో అమ‌ర్నాథ‌రెడ్డి విజ‌యం సాదించిన త‌ర్వాత వైసీపీని వీడి టీడీపీలో చేరిన విష‌యం తెలిసిందే. ఈ ఎన్నిక‌ల్లో ఆయ‌న టీడీపీ త‌ర‌ఫున పోటీ చేసి ప‌రాజయం పాల‌య్యారు. ఇక‌, చిత్తూరులోనూ ఈ ఏడు జ‌రిగిన ఎన్నిక‌ల్లో టీడీపీ ప‌ట్టు నిలుపుకోలేక పోయింది.


అంటే.. మొత్తంగా ద‌శాబ్ద‌కాలంగా చిత్తూరు పార్ల‌మెంటు ప‌రిధిలో టీడీపీ రేంజ్ ఒక్క కుప్పం త‌ప్పితే.. మిగిలిన నియోజ‌క‌వ‌ర్గాల్లో జీరో అని చెప్ప‌క త‌ప్ప‌దు. మ‌రి అలాంటి చోట పార్టీ ప‌రిస్థితి ఏంటి? ఉన్న బ‌ల‌మైన నాయ‌కుడు, ప్ర‌జ‌ల మ‌నిషిగా పేరు తెచ్చుకున్న శివ‌ప్ర‌సాద్ మ‌ర‌ణంతో ఏర్ప‌డిన లోటును ఎవ‌రు పూడుస్తారు? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా మారిపోయింది. పోనీ, శివ‌ప్ర‌సాద్ వార‌సుడిగా ఉన్న సింహ‌ప్ర‌సాద్‌కు ఇక్క‌డ ప‌గ్గాలు అప్ప‌గిస్తారా? అంటే.. అది అయ్యే ప‌నికాద‌ని అంటున్నారు విశ్లేష‌కులు.


అత్యంత కీల‌క‌మైన కుప్పం మిన‌హా ఆరు నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీని బ‌లోపేతం చేసేందుకు జూనియ‌ర్ అయిన సింహ‌ప్ర‌సాద్‌కు సాధ్యం కాద‌నే వాద‌న వ‌స్తోంది.ఈ నేప‌థ్యంలో కొత్త‌వారికి, బ‌ల‌మైన వారికి అవ‌కాశం ఇవ్వ‌క త‌ప్ప‌దు. అయితే, బాబు మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు దీనిపై ఎక్క‌డా స‌మాలోచ‌న‌లు కానీ, రివ్యూ కానీ చేయ‌క పోవ‌డం గ‌మ‌నార్హం. మ‌రోప‌క్క‌, వైసీపీ త‌ర‌ఫున ఇక్క‌డ ఎంపీ గా గెలిచిన రెడ్డ‌ప్ప దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. నెల‌లో 15 రోజులు నియోజ‌క‌వ‌ర్గంలో క‌లియ‌దిరుగు తున్నారు.


రెడ్డ‌ప్ప అంద‌రికీ అందుబాటులో ఉంటున్నారు. స‌మ‌స్య‌ల‌పై దృష్టి పెడుతున్నారు. దీంతో వైసీపీ పునాదులు బ‌లోపేతం అవుతున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. కొస‌మెరుపు ఏంటంటే. టీడీపీ ఆవిర్భ‌వించిన త‌ర్వాత 1984, ఆ త‌ర్వాత 1996 నుంచి 2014 వ‌ర‌కు కూడా చిత్తూరు పార్లమెంటు స్థానం నుంచి టీడీపీనే వ‌రుస విజ‌యాలు సాధిస్తోంది. అయితే, నాయ‌కులు లేని కార‌ణంగా ఇప్పుడు పార్టీ ఆఫీసు తాళం తీసే నాధుడు కూడా క‌నిపించ‌ని ప‌రిస్థిని చ‌వి చూస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: