ఏపీ సీఎం జగన్ తాడేపల్లిలోని నివాసంలోఉంటున్న సంగతి తెలిసిందే. అక్కడే ఆయన క్యాంపు కార్యాలయం కూడా ఉంది. ఇటీవల ఆయన నివాసానికి, క్యాంపు కార్యాలయానికి సంబంధించి వివిధ పనుల కోసం ఏపీ సర్కారు నిధులు విడుదల చేసింది. తాడేపల్లిలోని నివాసాలే కాకుండా హైదరాబాద్ లోని లోటస్ పాండ్ నివాసంలోనూ కొన్ని పనుల కోసం నిధులు విడుదల చేసింది. దీనిపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. టీడీపీ నేతలు లోకేశ్ వంటి వారు ట్వీట్లతో ఏకేశారు. మిగిలిన పార్టీల నాయకులూ విమర్శించారు.

 

అయితే ముఖ్యమంత్రి అన్నాక కొన్ని భద్రతాపరమైన ఏర్పాట్లు ఉంటాయి కాబట్టి.. ఆ మాత్రం ఖర్చు చేయడం పెద్ద విచిత్రమేమీ కాదని వైసీపీ నేతలు అప్పట్లో వాదించారు. అయితే విమర్శలకు స్పందనగానో ఏమిటో గానీ.. జగన్ ఈ విషయంలో వెనక్కు తగ్గారు. తాడేపల్లి తో పాటు హైదరాబాద్ లోటస్ పాండ్ నివాసానికి సెక్యూరిటీ కోసం కేటాయించిన నిధుల జీవో లను ప్రభుత్వం రద్దు చేసింది. తాడేపల్లి నివాసం కోసం ఫర్నిచర్ కొనుగోలు, విద్యుత్ సౌకర్యం, ఇతర వసతుల కోసం నిధులు కేటాయిస్తూ ఇటీవల విడుదలైన జీవోను రద్దు చేసింది.

 

మొత్తం సుమారు 3కోట్ల విలువైన పనులకు సంబందించిన కేటాయింపులను ప్రభుత్వం రద్దు చేసింది. ముఖ్యమంత్రి నివాసానికి ఏర్పాట్ల కోసం ప్రభుత్వమే నిధులు భరించాల్సి ఉన్నప్పటికీ జగన్ అందుకు అంగీకరించలేదని సమాచారం. అనవరసరమైన విమర్శలకు తావు ఇవ్వకూడదనే.. జగన్ ఈ ఆరు జీవోలను రద్దు చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కూడా జీవోలు రద్దు చేయాలని జగన్ ఆదేశించారట.

 

సొంత భద్రత కోసం సొంత నిధులు ఖర్చు కోసమే జగన్ మొగ్గిచూపినట్టు అనుకోవాలి. అయితే ఇప్పుడు జగన్ వెనక్కుతగ్గడాన్ని తమ విజయంగా టీడీపీ ప్రొజెక్టు చేసుకునే అవకాశం పుష్కలంగా ఉంది. మరి చూడాలి టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో.

మరింత సమాచారం తెలుసుకోండి: