ఏపీ రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు కావలసిన అన్ని ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. వివిధ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. మరో పది, పదిహేను రోజుల్లో ఈ రాజధాని మార్పు ప్రక్రియ పూర్తికావచ్చని అంటున్నారు. ఇందుకు అనుగుణంగానే జీఎన్ రావు కమిటీ నివేదిక ఇవ్వడం, అలాగే బోస్టన్ గ్రూప్ నివేదిక ఇవ్వడం.. ఈ రెండింటిని పరిశీలించేందుకు మంత్రులతో కూడిన హైపవ్ కమిటీ వేయడం జరిగిపోయాయి.

 

ఇప్పటికే హైపవర్ కమిటీ పలుసార్లు భేటీ అయ్యింది కూడా. అయితే రాజధాని మార్పు విషయంలో టెక్నికల్ గా ఎక్కడా ఇబ్బంది రాకుండా అన్ని విధాలా జాగ్రత్త పడుతున్నట్టు తెలుస్తోంది. అందుకే ముందు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి.. ఆమోదిస్తారని అప్పుడు చట్టపరంగా సమస్యలు ఉండబోవని వైసీపీ వర్గాలు చెబుతున్న సమాచారం. ఇదంతా కొన్నిరోజులుగా రాజకీయ వర్గాల్లో ప్రచారంలో ఉన్న విషయాలే. అయితే ఇప్పుడు మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే.. ఇక అమరావతి అనే పేరు కూడా ఉండబోదట.

 

ఆ మేరకు అసెంబ్లీలో బిల్లు రూపొందించబోతున్నారని తెలుస్తోంది. అదే జరగాలంటే ఇప్పటికే అమల్లో ఉన్న సీఆర్‌డీఏ చట్టాన్ని సవరించాల్సి ఉంటుంది. అది చేసైనా సరే.. అమరావతి అన్న పేరు లేకుండా చేయాలని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. రాజధాని అమరావతి పేరు మార్పు అంశం కూడా ఈ అసెంబ్లీ సమావేశాల సమయంలోనే తెరపైకొస్తుందని చెబుతున్నారు.

 

వాస్తవానికి అమరావతి అన్న పేరుతో ఓ చిన్న పట్టణం మాత్రమే ఉంది. కానీ చంద్రబాబు సీఎం అయ్యాక రాజధానికి అమరావతి అనే పేరు పెట్టి నిర్మాణానికి సన్నాహాలు చేశారు. ఇప్పుడు జగన్ సర్కారు చేసేదే నిజమైతే.. అమరావతి అనే పేరు ఆ చిన్న పట్టణానికి మాత్రమే మిగిలిపోతుంది. మరి నిజంగా జగన్ సర్కారు అంత పని చేస్తుందా.. అసలు అమరావతి అనే పేరు లేకుండా చేస్తుందా అన్నది అసెంబ్లీ సమావేశాల తర్వాత కానీ తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి: