వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్వగ్రామమైన నారావారిపల్లెలో ఈరోజు ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి . ఎమ్మెల్యే చెవిరెడ్డి ఆధ్వర్యంలో మూడు రాజధానులను స్వాగతిస్తూ నారావారిపల్లెలో భారీ బహిరంగ సభ జరిగింది. తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు మాత్రం నారావారిపల్లెలో బహిరంగ సభ నిర్వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.                                            
 
వైసీపీ బహిరంగ సభ నిర్వహించటంతో వైసీపీకి పోటీగా తెలుగుదేశం పార్టీ ఈరోజు శాంతియుతనిరసన తెలిపింది. తెలుగుదేశం పార్టీ ఒకే రాష్ట్రం - ఒకే రాజధాని పేరుతో శాంతియుత నిరసన చేపట్టింది. స్థానిక ఎన్టీయార్ విగ్రహం దగ్గర మహిళలు భారీ స్థాయిలో నిరసన కార్యక్రమాలను చేపట్టారు. ఇటు వైసీపీ, అటు టీడీపీ రెండు కార్యక్రమాలను చేపట్టడంతో భారీగా పోలీసులను మోహరించారు. 
 
పోలీసులు రాష్ట్రంలో వైసీపీ పార్టీ సభ జరుగుతోందని అందువలన ఆందోళనను విరమించాలని విజ్ఞప్తి చేశారు. నారావారిపల్లె గ్రామానికి పోలీసుల రాకతో ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మరోవైపు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇంటి సమీపంలో కూడా మహిళలు నిరసనకు దిగారు. చెవిరెడ్డి నారావారిపల్లెలో సభ పెట్టుకోవడం తగదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
మహిళలు నారావారిపల్లెలో మూడు రాజధానులు వద్దు అమరావతి ముద్దు అనే నినాదంతో హోరెత్తిస్తున్నారు. మహిళలు ఇది చంద్రబాబు స్వగ్రామామని ఇక్కడ వైసీపీ నేతలు సభ పెట్టాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. చెవిరెడ్డి సొంతూరులో తెలుగుదేశం పార్టీ నేతలు ఎప్పుడైనా ఈ విధంగా సభలు పెట్టారా...? అని మహిళలు ప్రశ్నిస్తున్నారు. వైసీపీ టీడీపీ ఇరు పార్టీల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉండటంతో పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్త పడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: