ఏపీ సీఎం జగన్ కు హైకోర్టు షాక్ ఇచ్చింది. కర్నూల్ కు విజిలెన్స్ కార్యాలయాల తరలింపుపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషన్లపై విచారణ పెండింగ్ లో ఉందని ఇలాంటి సమయంలో ఆఫీసులను తరలించాల్సిన అవసరం ఏముందని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వం కార్యాలయాల తరలింపు గురించి వెంటనే వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది.
నిన్న ఇంద్రనీల్ అనే వ్యక్తి పిటిషన్ వేయగా ఈరోజు ఉదయం పిటిషన్ విచారణకు వచ్చింది. రెండు లంచ్ మోషన్ పిటిషన్లు ఇదే అంశంపై దాఖలయ్యాయి. మొత్తం మూడు పిటిషన్ల గురించి మధ్యాహ్నం మూడు గంటలకు మరోసారి హైకోర్టు విచారణ చేపట్టనుంది. ప్రస్తుతం అమరావతికి సంబంధించిన కొన్ని కేసులు పెండింగ్ లో ఉన్నాయని రైతులు దాఖలు చేసిన పిటిషన్లు కూడా పెండింగ్ లో ఉన్నాయని ప్రభుత్వ కార్యాలయాలను తరలిస్తూ జీవోలను ఎలా విడుదల చేస్తారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.
దీనిపై వివరణ ఇవ్వాలని హైకోర్టు అడ్వకేట్ జనరల్ ను కోరింది. ఫిబ్రవరి నెల 26వ తేదీ వరకు కార్యాలయాలను ఎక్కడికీ తరలించవద్దని ఆదేశాలను కోర్టు జారీ చేసిందని అయినా ఆదేశాలను లెక్క చేయకుండా కార్యాలయాలను ఎందుకు తరలిస్తున్నారని న్యాయమూర్తి ప్రశ్నించారు. అడ్వకేట్ జనరల్ ఇక్కడ కార్యాలయల నిర్వహణ సరిగ్గా లేదని అందువలన కార్యాలయాలను తరలించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు.
న్యాయమూర్తి కార్యాలయాల నిర్వహణ సరిగ్గా లేని పక్షంలో ఇక్కడే కొత్త నిర్మాణాలను చేపట్టవచ్చు కదా అని ప్రశ్నించారు. ఈ పిటిషన్ తో పాటు మరో రెండు పిటిషన్లు దాఖలైనందున న్యాయమూర్తి మధ్యాహ్నం 3 గంటల తరువాత మరోసారి విచారణ చేపడతామని చెప్పారు. మధ్యాహ్నం విచారణలో న్యాయమూర్తి రెండు వైపులా వాదనలను విని ఆదేశాలను జారీ చేయనున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి