ప్రజా పరిపాలన లో సంచలనాలు సృష్టిస్తూ వైసీపీ అధినేత జగన్ పరిపాలన ప్రజల నుంచి నీరాజనాలు అందుకుంటున్నాయి. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఎన్ని అడ్డంకులు వచ్చినా లెక్క చేయకుండా ముందుకు దూసుకెళ్తున్నారు ఏపీ సీఎం జగన్. మొన్నటి వరకు కేంద్రంలో బిజెపి వైసిపి విషయంలో చిన్న చూపు చూసినా జగన్ తన నిర్ణయాలకు ఎటువంటి ఆటంకం లేకుండా కేంద్రం తోనే శభాష్ అనిపించుకునేలా  చేసుకోగలిగారు. ప్రభుత్వపరంగా జగన్ బాగానే సక్సెస్ అవుతున్నారు. కానీ ఇప్పుడు సొంత పార్టీ నాయకులు మధ్య ఏర్పడుతున్న గ్రూపు రాజకీయాలు జగన్ కు ఇబ్బందికరంగా మారాయి. ముఖ్యంగా ఎమ్మెల్యేలు ఎంపీల మధ్య ఆధిపత్య పోరు తీవ్రంగా ఉంది. 


ఈ తరహా వ్యవహారం ప్రతి చోటా నెలకొంది. ఈ విషయంలో ఎన్నిసార్లు హెచ్చరించినా పరిస్థితిలో పెద్దగా మార్పు రావడం లేదు. తాజాగా గుంటూరు జిల్లాలో అధికార పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే మధ్య రాజకీయ వైరం కొనసాగుతోంది. కొద్ది రోజుల క్రితం ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, చిలకలూరిపేట నియోజకవర్గం కి వచ్చిన సందర్భంగా ఎమ్మెల్యే వర్గీయులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే కి తెలియకుండా ఏవిధంగా పర్యటన చేస్తున్నారు అంటూ వారు నిరసన తెలియజేశారు. దీంతో ఎంపీ వెనక్కి తగ్గి అక్కడి నుంచి వెళ్లిపోయారు. తాజాగా నిన్న అర్ధరాత్రి చిలకలూరిపేట ఎమ్మెల్యే రజిని టార్గెట్ గా  కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. 


ఈ సంఘటనలో రజని మరిది గోపీ కి గాయాలయ్యాయి. కారు ధ్వంసం అయ్యింది. కోటప్పకొండ లో విడదల వారి ప్రభను ఇచ్చి వస్తున్న సమయంలో అర్ధరాత్రి ఈ దాడి జరిగింది. అయితే ముందుగా ఇది తెలుగుదేశం నాయకుల వ్యవహారం గా భావించినా  కొద్దిరోజుల క్రితం ఏర్పడిన వైరం కారణంగానే ఈ సంఘటన చోటు చేసుకుంది అని ఎమ్మెల్యే వర్గం ఆరోపిస్తోంది. అయితే ఈ విషయంలో నిజానిజాలు ఏమిటన్నది ఇంకా తేలలేదు. ఎంపీ, ఎమ్మెల్యే వ్యవహారం పై  అధిష్టానం కూడా సీరియస్ గానే దృష్టి పెట్టింది. ఈ పోరు మరింత ఉద్ధృతం కాకుండా చూడాలనే ఉద్దేశంతో అధిష్టానం పెద్దలు రంగంలోకి దిగినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: