2016 సంవత్సరం నవంబర్ 8వ తేదీన బీజేపీ ప్రభుత్వం 500 రూపాయలు, 1000 రూపాయల నోట్లను రద్దు చేసి 2000 రూపాయల నోట్లను అందుబాటులోకి తెచ్చింది. నల్లధనం పెరిగిపోతుందని ఆరోపిస్తూ కేంద్రం 2000 నోటును ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. కానీ గత వారం రోజులుగా 2000 రూపాయల నోటు రద్దు కాబోతుందని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. 
 
ఆర్థిక శాఖ బ్యాంకులకు తాజాగా ఏటీఎంలలో 2,000 రూపాయల నోట్లు పెట్టొద్దంటూ ఆదేశాలు జారీ చేసిందంటూ ప్రచారం జరుగుతోంది. బ్యాంకు సంబంధిత వర్గాలు తమ ఏటీఎంలలో ఎక్కువగా 2000 రూపాయల నోట్లకు బదులు 500 రూపాయల నోట్లను ఉంచుతున్నాయి. ఆర్బీఐ ఇప్పటికే 2000 రూపాయల నోట్ల ప్రింటింగ్ ను నిలిపివేసింది. బ్యాంకులు ఆర్థిక శాఖ నుండి ఆదేశాలు లేకపోయినా తక్కువ విలువ గల నోట్లతో ఏటీఎంలను నింపుతున్నాయి. 
 
కొన్ని బ్యాంకులు తమ ఏటీఎంలలో 2,000 రూపాయల నోట్లను ఉంచబోమని చెబుతూ ఉండటంతో 2000 రూపాయల నోట్లు రద్దు కాబోతున్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలు వైరల్ అవుతూ ఉండటంతో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ 2000 రూపాయల నోట్ల రద్దు గురించి స్పందించారు. 
 
2000 రూపాయల నోట్లు ఏటీఎంలలో పెట్టొద్దంటూ బ్యాంకులకు తాము ఆదేశాలు జారీ చేయలేదని చెప్పారు. కేంద్ర మంత్రి స్పందించినా ప్రజల్లో చాలామంది 2000 రూపాయల నోటు రద్దు కాబోతుందంటూ జరుగుతున్న ప్రచారాన్ని నమ్మడం గమనార్హం. ఎస్బీఐ అధికారులు ఇప్పటికే ఎస్బీఐ ఏటీఎంలలో 2000 రూపాయల నోట్లను ఉంచబోమని ప్రకటన చేయగా తాజాగా ఇండియన్ బ్యాంక్ అధికారులు 2000 రూపాయల నోట్లు ఏటీఎంలలో పెట్టకూడదని నిర్ణయించుకున్నారు. ప్రభుత్వం స్పష్టత ఇస్తున్నా 2000 రూపాయల నోట్ల రద్దు గురించి ప్రచారం జరుగుతూనే ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: