దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచార కేసులో ఢిల్లీ పటియాల హౌస్ కోర్టు కొత్త డెత్  వారెంట్లను జారీ చేసింది. ఇప్పటికే ఉరిశిక్ష అమలు మూడుసార్లు వాయిదా పడగా నాలుగోసారి డెత్ వారెంట్లు జారీ అయ్యాయి. మార్చి 20న ఉదయం 5.30 గంటలకు దోషులను ఉరి తీయాలని కోర్టు ఆదేశించింది. దోషులను తీహార్ జైల్లో ఉరి తీయనున్నారు. ఇప్పటికే మూడుసార్లు డెత్ వారెంట్లు జారీ అయినా ఉరిశిక్ష అమలు వాయిదా పడింది. 
 
దోషులు న్యాయపరంగా ఉన్న అవకాశాలన్నీ ఇప్పటికే వినియోగించుకున్నారు. అందువలన ఈసారి ఉరిశిక్ష పడటం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దోషులు గతంలో మూడుసార్లు కోర్టులను ఆశ్రయించడంతో ఉరిశిక్ష అమలు వాయిదా పడింది. నలుగురు దోషులు అక్షయ్ సింగ్, వినయ్ కుమార్, పవన్ కుమార్ గుప్తా, ముఖేష్ కుమార్ సింగ్ లను ఒకేసారి ఉరి తీయనున్నారు. 
 
నిందితులలో ఒకరైన పవన్ గుప్తా పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ ను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరస్కరించారు. నలుగురు దోషులు మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పరీక్షించేందుకు మానవ హక్కుల కమిషన్ ను ఆదేశించాలని పిటిషన్ దాఖలు కాగా కోర్టు దానిని కొట్టివేసింది. ఢిల్లీ ప్రభుత్వం తాజాగా డెత్ వారెంట్లు జారీ చేయాలంటూ కోర్టును ఆశ్రయించటంతో వారెంట్లు జారీ అయ్యాయి. 
 
2012 డిసెంబర్ 16న కదులుతున్న బస్సులో ఆరుగురు పిజియోథెరపీ స్టూడెంట్ నిర్భయపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తరువాత బస్సులో నుండి ఆమెను కిందికి విసిరేశారు. సింగపూర్ లో చికిత్స పొందుతూ నిర్భయ మృతి చెందింది. ఆరుగురు దోషులలో ప్రధాన నిందితుడు తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మరో నిందితుడు మైనర్ కావడంతో మూడేళ్ల జైలు శిక్ష అనంతరం విడుదలయ్యాడు. మిగతా నలుగురు నిందితులకు కోర్టు ఉరిశిక్ష వేసింది. దోషులు అవకాశాలన్నీ వినియోగించుకోవడంతో కోర్టు తాజాగా డెత్ వారెంట్లు జారీ చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: