ఈ మధ్య కాలంలో యూత్ ఫేస్ బుక్ లో పరిచయం అయిన వ్యక్తులతో ప్రేమలో పడుతున్నారు. ఛాటింగ్ లోనే యువతీయువకుల మధ్య ప్రేమ చిగురిస్తోంది. కొందరు ఒకరి ముఖాలు మరొకరికి తెలియకుండా ప్రేమించుకుంటున్నారు. ఈ ఫేస్ బుక్ ప్రేమల పేరుతో కొందరు మోసాలకు పాల్పడుతున్నట్టు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. కానీ ఒక యువతి మాత్రం ఫేస్ బుక్ లో పరిచయమైన వ్యక్తిని ప్రేమించి అతడు దివ్యాంగుడని తెలిసినా పెళ్లి చేసుకుంది. 
 
వినడానికి సినిమా కథలా అనిపించినా ఈ యదార్థ ఘటన కేరళ రాష్ట్రంలో చోటు చేసుకుంది. పెద్దలు యువకునితో పెళ్లికి అంగీకరించకపోయినా అతడినే పెళ్లాడింది. పూర్తి వివరాలలోకి వెళితే కేరళలోని తాజెకాడ్ ప్రాంతానికి చెందిన పవన్ ఆరు సంవత్సరాల క్రితం బైక్ యాక్సిడెంట్ కు గురయ్యాడు. ప్రమాదంలో యువకుని కాలు కింద భాగం చచ్చుబడిపోవడంతో ఒంటరిగా ఏ పనీ చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. 
 
ప్రమాదంలో కాలు చచ్చుబడినా పవన్ నిరాశానిస్పృహలకు లోను కాలేదు. ఆత్మవిశ్వాసంతో వివిధ ప్రాంతాలకు వెళ్లి స్పూర్తిదాయక ప్రసంగాలు ఇచ్చేవాడు. అతని ప్రసంగాలు యూట్యూబ్, ఫేస్ బుక్ లో వైరల్ అయ్యాయి. అతని ప్రసంగాలకు ముగ్ధురాలైన షహానా ఫేస్ బుక్ లో పవన్ తో పరిచయం పెంచుకుని తన ప్రేమను వ్యక్తపరిచింది. పవన్ కూడా యువతిని ప్రేమించినా తన పరిస్థితుల దృష్ట్యా మొదట వివాహానికి అంగీకరించలేదు. 
 
షహానా మాత్రం పెళ్లంటూ చేసుకుంటే పవన్ నే చేసుకుంటానని పట్టు పట్టింది. యువతి తన ఇంట్లో ప్రేమ విషయం చెప్పగా వారు అంగీకరించకపోవడంతో ఇంటి నుండి బయటకు వచ్చేసింది. యువకుడి కుటుంబ సభ్యులు ఆమెకు నచ్చజెప్పటానికి ఎంతో ప్రయత్నించారు. బంధం అనేది మనసుకు సంబంధించినది అని తాను పవన్ నే చేసుకుంటానని యువకుడి కుటుంబ సభ్యులకు యువతి తేల్చి చెప్పింది. కొన్ని రోజుల క్రితం వీరిద్దరి వివాహం కేరళలోని ఒక ఆలయంలో ఘనంగా జరిగింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: