ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుందనే మాట మనం తరచుగా వింటునే ఉంటాం. అలానే సీఎం జగన్ విజయం వెనుక ముగ్గురు మహిళలు ఉన్నారు. జగన్ ఏపీ సీఎం కావడం వెనుక ఆయన తల్లి విజయమ్మ, చెల్లి షర్మిళ, సతీమణి భారతి పాత్ర ఎంతో ఉంది. 2014 ఎన్నికల్లో 67 సీట్లను సాధించి జగన్ ప్రతిపక్షానికి పరిమితమయ్యారు. ముఖ్యమంత్రి కాకముందు జగన్ రాజకీయంగా, వ్యక్తిగతంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 
 
జగన్ సంతోషాల్లో... బాధల్లో ఆయన తల్లి, చెల్లి, సతీమణి అండగా నిలిచి రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రావడానికి తమ వంతు కృషి చేశారు. సోషల్ మీడియాలో వైసీపీ ట్విట్టర్ ఖాతా ద్వారా మన ముఖ్యమంత్రి జగన్ గారి విజయం వెనుక ఉన్న ఆ స్త్రీ మూర్తులు వీరే... అంటూ ఒక వీడియోను షేర్ చేసింది. మహిళా దినోత్సవం సందర్భంగా వైసీపీ సోషల్ మీడియాలో ఈ వీడియోను షేర్ చేసింది. 
 
దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జగన్ రాష్ట్ర ప్రజలకోసం ఆశాజ్యోతిలా నిలబడ్డారు. జగన్ చేసిన పాదయాత్రలో విజయమ్మ, షర్మిళ, భారతి పాల్గొని జగన్ వెంట నడిచారు. జగన్ అక్రమాస్తుల కేసులో జైలులో ఉన్న సమయంలో పార్టీని ఈ ముగ్గురే నడిపించారు. జగన్ వదిలిన బాణాన్ని తాను అంటూ షర్మిల పాదయాత్రలో పాల్గొని ప్రజల కష్టాలు తెలుసుకున్నారు. 
 
పార్టీకి, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ముగ్గురు స్త్రీ మూర్తులు పార్టీ అధికారంలోకి రావడానికి తమ వంతు కృషి చేశారు. జగన్ కష్టాల్లో, సంతోషాల్లో వీరు ముగ్గురూ ఎల్లప్పుడూ తోడుగా నిలిచారు. వీరి ముగ్గురి ప్రోత్సాహంతోనే జగన్ ఈరోజు ఏపీ సీఎం అయ్యారని వైసీపీ ట్వీట్ లో పేర్కొంది. మహిళా దినోత్సవం సందర్భంగా విజయమ్మ, షర్మిళ, భారతిలకు వైసీపీ శుభాకాంక్షలు తెలిపింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: