వైసీపీ తరపున నలుగురు రాజ్యసభ సభ్యులు ఖరారయ్యారు. విధేయత, సామాజిక సమీకరణాలు, రాష్ట్ర అవసరాలను బేరీజు వేసుకుని పేర్లు ఖరారు చేశారు సీఎం జగన్.. పెద్దల సభకు వెళ్లే ఆ నలుగురి రాజకీయ ప్రస్థానం తెలుసుకుందాం.

 

పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ,  అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వాని.. ఈ నలుగురు ఏపీ నుంచి పెద్దలసభకు వెళ్లనున్నారు. పార్టీకి విధేయత,  సామాజిక సమీకరణాలు, రాష్ట్ర అవసరాలను దృష్టిలో  పెట్టుకుని... వీరి పేర్లను ఖరారు చేశారు. ఇందులో మొదట చెప్పుకోవాల్సింది పిల్లిసుభాష్ చంద్రబోస్... మండలి నుంచి ఎన్నికై , డిప్యూటీ సీఎంగా పిల్లి సుభాష్ చంద్రబోస్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మాజీసీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి ఆది నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్ విధేయులు. గతంలో రెండుసార్లు  వైఎస్ ఆర్ కేబినెట్‌లోనూ,  రోశయ్య కేబినెట్‌లో ఓ సారి మంత్రిగా పనిచేశారు పిల్లి సుభాష్ చంద్రబోస్.  వైసీపీలో చేరేందుకు గానూ .. రామచంద్రాపురం ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేశారు .  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదుగురు డిప్యూటీ సీఎంల్లో పిల్లి కూడా ఒకరు.. దీనితో పాటు రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్‌ శాఖల బాధ్యతలు చూస్తున్నారు పిల్లి.  అయితే శాసనమండలిని రద్దు చేయాలని నిర్ణయించిన జగన్.. వీరిని రాజ్యసభకు పంపించాలని నిర్ణయించారు. 

 

మోపిదేవి వెంకటరమణ... 1962లో గుంటూరు జిల్లా నిజాంపట్నంలో జన్మించారు. విజయవాడ లయోలా డిగ్రీ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. బీసీ వర్గానికి చెందిన ముఖ్యనేతగా ఎదిగారు మోపిదేవి. రాజశేఖరరెడ్డి కుటుంబానికి ఆదినుంచి విధేయుడు. గతంలో వైఎస్సార్ కేబినెట్‌లో పోర్టులు, ఇన్‌ఫ్ర్సా స్ట్రక్చర్, ఇన్వెస్ట్‌మెంట్స్ శాఖ మంత్రిగానూ.. కిరణ్ కుమార్  రెడ్డి మంత్రివర్గంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. కృష్ణాజిల్లా కూచిపూడి నుంచి 1989,1994ల్లో ఓటమి చవిచూసిన మోపిదేవి, 1999,2004ల్లో గెలిచారు. 2009లో గుంటూరుజిల్లా రేపల్లె నియోజకవర్గం నుంచి గెల్చిన మోపిదేవి.. 2014,2019ల్లో ఓటమిపాలయ్యారు. అయితే విధేయత, సామాజిక సమీకరణాల దృష్ట్యా జగన్.. మోపిదేవిని మండలికి నామినేట్ చేశారు సీఎం జగన్. ప్రస్తుతం మోపిదేవి వెంకటరమణ.. పశు సంవర్థక శాఖ, మార్కెటింగ్ శాఖల బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

 

అయోధ్యరామిరెడ్డి.. ఈయన పెద్ద పారిశ్రామిక వేత్త.  రాంకీ గ్రూప్‌ ఆఫ్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు. ఏడు విభిన్న కంపెనీలకు అధిపతిగా వ్యవహరిస్తున్నారు. రామిరెడ్డి కర్ణాటక యూనివర్సిటీ నుంచి అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, ఉస్మానియా నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. పుట్టింది గుంటూరు జిల్లా నర్సరావు పేట. వీరి తండ్రిగారి కాలం నుంచి రాజకీయాల్లో ఉంది ఈ కుటుంబం. దశాబ్ద కాలం నుంచి సేవారంగంలోనూ కీలకపాత్ర పోషిస్తున్నారు. వైఎస్ ఆర్  సంక్షేమపథకాలు నచ్చి రాజకీయాల్లోకి వచ్చారు అయోధ్యరామిరెడ్డి. 2014లో నర్సరావు పేట నియోజక వర్గం నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన అయోధ్యరామిరెడ్డి.. రాయపాటి సాంబశివరావుచేతిలో ఓటమిపాలయ్యారు. పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీ మేరకు అయోధ్య రామిరెడ్డి పేరును.. రాజ్యసభకు ఖరారు చేశారు జగన్. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్నివిధాలుగా అండగా నిలిచారు అయోధ్యరామిరెడ్డి. 

 

ఇక వైసీపీ ఎంపిక చేసిన నాలుగో అభ్యర్థి పరిమళ్ నత్వాని.  పూర్తి పేరు పరిమల్ ధీరజ్‌లాల్ నత్వానీ.. పారిశ్రామిక వేత్త అయిన నత్వానీ.. 2008, 2014ల్లో  జార్ఖండ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1997లో రిలయన్స్ గ్రూపులో చేరిన పరిమల్.. 2016నాటికి ఆర్‌ఐఎల్ కార్పొరేట్ అఫైర్స్ గ్రూప్ ప్రెసిడెంట్‌గా ఎదిగారు.  నత్వానీ.. ధీరుబాయ్ అంబానీకి  అత్యంత సన్నిహితులు. ప్రస్తుతం ముఖేష్ అంబానీకి సన్నిహితుల్లో ఒకరు. 

మరింత సమాచారం తెలుసుకోండి: