ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై విచారణ ముగిసింది. జగన్ సర్కార్ కు సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. సుప్రీం ఎన్నికల నిర్వహణ ఎప్పుడనే విషయంలో తుది నిర్ణయం ఎన్నికల కమిషన్ దే అని స్పష్టం చేసింది. ఎన్నికల కమిషనర్ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీం కోర్టు సమర్థించింది. ఐతే తక్షణం ఎన్నికల కోడ్ ను ఎత్తివేయాలని సుప్రీం సూచించింది. 
 
ఎన్నికల కోడ్ ఎత్తివేయడంతో ప్రభుత్వం పథకాలను యథావిధిగా అమలు చేయవచ్చు. కొత్త పథకాలు అమలు చేయాలంటే మాత్రం ప్రభుత్వం ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఎన్నికల వాయిదాను సుప్రీం సమర్థించటంతో ఏపీ ప్రభుత్వానికి షాక్ తగిలింది. సుప్రీం తీర్పుతో ఎన్నికలు ఆరు వారాల తరువాత జరిగే అవకాశం ఉంది. ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని వాదనలు వినిపించింది. 
 
సుప్రీం ఈసీ నిర్ణయాన్ని సమర్థించినా ఎన్నికల కోడ్ ఎత్తివేయాలని ఆదేశించటం ప్రభుత్వానికి శుభవార్తే అని చెప్పవచ్చు. గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులను పరిగణనలోకి తీసుకొని ఈ తీర్పు చెప్పింది. ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి ముందుగానే తెలియజేసి ఉంటే బాగుండేదని సుప్రీం అభిప్రాయం వ్యక్తం చేసింది. 
 
కేంద్రం కరోనా వైరస్ ను జాతీయ విపత్తుగా ప్రకటించటంతో ఎన్నికల కమిషన్ రాష్ట్రంలో ఎన్నికలను వాయిదా వేసిన విషయం తెలిసిందే. వైసీపీ ఈసీ నిర్ణయంపై విమర్శలు వ్యక్తం చేసింది. ఎన్నికలు వాయిదా పడకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. సుప్రీంలో వైసీపీకి అనుకూల తీర్పు రాకపోయినా ఎన్నికల కోడ్ ను ఎత్తివేయటంతో ఉగాది పండుగకు ప్రభుత్వం ఇళ్ల పట్టాలను పంపిణీ చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. సుప్రీం తీర్పు నేపథ్యంలో వైసీపీ ఎలా ముందుకెళుతుందో చూడాల్సి ఉంది.                         

మరింత సమాచారం తెలుసుకోండి: