ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల సరిహద్దులు మూసివేసిన విషయం తెలిసిందే. అత్యవసర సేవలు, గూడ్స్ వాహనాలు మినహా మరే ఇతర వాహనాలను అనుమతించటం లేదు. పోలీసులు ముందస్తుగా వచ్చే వాహనాలను తనిఖీలు చేసిన అనంతరం వారి నుండి పూర్తి వివరాలను సేకరించి కొందరికి మాత్రం అనుమతి ఇస్తున్నట్లు తెలుస్తోంది. కూరగాయలు, పాల వాహనాలకు మాత్రం పోలీసులు అనుమతి ఇస్తున్నారు. 
 
తెలంగాణ పోలీసులు ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేయడంతో ప్రజలెవరూ కూడా బయటకు రాని పరిస్థితి నెలకొంది. అధికారులు ఏపీ వైపు దారులు ముసివేసినట్లు ప్రకటనలు చేయటంతో చాలా తక్కువ సంఖ్యలో ఏపీ వైపు వెళ్లేందుకు వాహనాలు వస్తున్నాయని వాటిని కూడా వెనక్కు పంపిస్తున్నామని తెలిపారు. నిన్న చాలా వాహనాలు వచ్చినప్పటికీ ఈరోజు మాత్రం ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో తక్కువ సంఖ్యలో వాహనాలు వస్తున్నాయని సమాచారం. 
 
పోలీసులు మీడియాతో మాట్లాడుతూ కొంతమంది నగరాలలో చదువుకునే విద్యార్థులు వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారని, మెడికల్ ఎమర్జెన్సీ వల్ల కొందరు బోర్డర్ దగ్గరకు వాహనాలతో చేరుకుంటున్నారని తెలిపారు. మెడికల్ ఎమర్జెన్సీతో వచ్చిన వాళ్లను హెల్త్ డిపార్టుమెంట్ వాళ్లతో చెక్ చేయించి వారికి అనుమతులు ఇస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ బోర్డర్ దాటినా ఆంధ్ర బోర్డర్ లో మరలా ఆ వాహనాలకు తనిఖీలు జరుగుతాయని పేర్కొన్నారు. 
 
అనుమతులు ఉన్న నిత్యావసర వస్తువుల వాహనాలను మాత్రమే తాము అనుమతిస్తున్నామని చెప్పారు. పరిస్థితులు పోలీసుల ఆధీనంలోనే ఉన్నాయని.. ఎటువంటి వాగ్వాదాలు చోటు చేసుకోలేదని తెలిపారు. ఆంబులెన్స్ ద్వారా కొంతమంది ప్రయాణికులు బోర్డర్ దాటే ప్రయత్నాలు చేసిన మాట వాస్తవమేనని వాటిపై నిన్న కేసులు నమోదు చెశామని తెలిపారు. కరోనా ప్రభావంతో ఆంధ్ర తెలంగాణ బోర్డర్ దాటాలనుకున్న వాహనదారులకు మాత్రం కష్టాలు మొదలయ్యాయి.                  

మరింత సమాచారం తెలుసుకోండి: