తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు మీడియాతో మాట్లాడుతూ కంటికి కనిపించని శత్రువైన కరోనాను లాక్ డౌన్ తో కొంతమేరకు కట్టడి చేయగలుగుతున్నామని చెప్పారు. కరోనా ఆర్థిక వ్యవస్థకు పెను సవాల్ గా మారిందని అన్నారు. ఇలాంటి సమయంలో ప్రజల ప్రాణాలు కాపాడుకోవడం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. కరోనాపై అందరూ వీరోచితంగా పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పారు. 
 
ప్రతి ఒక్కరూ కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు లాక్ డౌన్ నిబంధనలను పాటించాలని సూచించారు. అగ్ర దేశాలు సైతం కరోనాతో అతలాకుతలమవుతున్నాయని పేర్కొన్నారు. దేశంలోని కొన్ని రాష్ట్రాలు కరోనాను కట్టడి చేయడంలో సక్సెస్ అవుతున్నాయని... మరికొన్ని రాష్ట్రాలు మాత్రం కరోనా విషయంలో ఫెయిల్ అవుతున్నాయని పేర్కొన్నారు. 
 
ప్రధాని మోదీకి కరోనా నియంత్రణ చర్యలపై ఇటీవల లేఖ రాశానని ఆ లేఖలో తాను కొన్ని సూచనలు చేశానని చంద్రబాబు తెలిపారు. కరోనా లాంటి సున్నితమైన అంశాల్లో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తాను సూచించానని చెప్పారు. నిన్న ప్రధాని కార్యాలయానికి ఫోన్ చేసి ఆయనతో మాట్లాడాలని అడిగానని ఈరోజు ఉదయం 8.30 గంటలకు మోదీ ఫోన్ చేశారని చెప్పారు. మోదీతో తన ఆలోచనలను పంచుకున్నానని చెంద్రబాబు అన్నారు. 
 
మన దేశం కరోనాపై పోరాడటంలో అగ్ర స్థానంలో ఉందని... సరైన విధంగా అంచనా వేయలేని దేశాలు కరోనా కట్టడిలో విఫలమయ్యాయని చెప్పారు. ప్రధాని మోదీ లాక్ డౌన్ నిర్ణయం వల్లే దేశంలో కరోనా అదుపులో ఉందని అన్నారు. ఏపీలో ల్యాబ్ ల సంఖ్యను పెంచాలని ప్రభుత్వానికి చంద్రబాబు సూచించారు. మనం జాగ్రత్తగా ఉంటే మాత్రమే కరోనా సమస్యకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. లాక్ డౌన్ ఆర్థిక వ్యవస్థకు పెను సవాలు కానీ ప్రజల ప్రాణాలు కూడా ఎంతో ముఖ్యమని చెప్పారు. ఎవరిలోనైనా కరోనా లక్షణాలు కనిపిస్తే స్వచ్చంధంగా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: