తెలంగాణ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజుకింత పెరుగుతోంది . మంగళవారం ఒక్క రోజే 52 కేసులు నమోదు కావడం అందర్నీ కలవరపరుస్తోంది . తొలిదశ లాక్ డౌన్ ముగిసే సమయానికి కూడా తెలంగాణ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతుండడం తో ,  రాష్ట్ర ప్రభుత్వానికి  ఏమి చేయాలో పాలుపోని పరిస్థితి  నెలకొంది . తొలుత విదేశాల నుంచి వచ్చిన వారికి  కరోనా పాజిటివ్ లక్షణాలు కన్పించగా , ఆ తరువాత నిజాముద్దీన్ మర్కజ్ మసీదు లో జరిగిన మతసమ్మేళనం లో పాల్గొన్న వారివల్ల కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూ వచ్చింది .

 

నిజాముద్దీన్ మర్కజ్ కు వెళ్లివచ్చిన వారిని  కాంటాక్ట్ అయిన వారు   కూడా కరోనా బారిన పడ్డారు . అయితే మర్కజ్ కు వెళ్లివచ్చిన వారిని గుర్తించి , కరోనా పాజిటివ్ లక్షణాలున్న వారిని ఐసోలేషన్ కు  , అనుమానితులను క్వారంటైన్ కు తరలించిన తరువాత రాష్ట్రం లో పాజిటివ్ కేసుల సంఖ్య  తగ్గుముఖం పడుతుందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేశాయి . అయితే అనూహ్యంగా కేసుల సంఖ్య పెరుగుతుండడం  ఆందోళన కలిగించే అంశం కాగా , హైదరాబాద్ నగరం లో చోటు చేసుకున్న రెండు పాజిటివ్ కేసుల పూర్వాపరాలు నగరవాసులను మరింత కలవరానికి గురి చేస్తున్నాయి .

 

ఈ రెండు కేసుల్లోను బాధితులు కరోనా వ్యాధి గ్రస్తులతో కాంటాక్ట్ అయిన  దాఖలాలు లేకపోయినప్పటికీ , వారిద్దరికీ పాజిటివ్ లక్షణాలు కన్పించడం తో , వైద్య నిపుణులు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు . వీరిద్దరికి అసలు కరోనా ఎలా సోకిందన్న దానిపై వైద్యులు దృష్టి సారించారు . ఇక రాష్ట్రం లో లాక్ డౌన్ కొనసాగుతున్న  ప్రస్తుత పరిస్థితుల్లోను,  కేసుల సంఖ్య స్థిరంగా  కొనసాగడం చూస్తుంటే , రానున్న రోజుల్లో తెలంగాణ లో పరిస్థితి మరింత విషమించే ప్రమాదం లేకపోలేదన్న వాదనలు విన్పిస్తున్నాయి . 

మరింత సమాచారం తెలుసుకోండి: