మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు మీడియాతో మాట్లాడారు. ఒకవైపు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే చంద్రబాబు కేసీఆర్ ను గెలికారు. తాజాగా సీఎం కేసీఆర్ గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను భువనగిరి ఏయిమ్స్ తరహాలో టిమ్స్ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈరోజు చంద్రబాబు మాట్లాడుతూ తానే ఆ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను కట్టించానని... ఇప్పుడు ఆ స్పోర్ట్స్ కాంప్లెక్స్ 1500 పడకల కరోనా ఆస్పత్రిగా సిద్ధం కానుందని తెలిపారు. 
 
మరి తానే స్పోర్ట్స్ కాంప్లెక్స్ కట్టించానని... అదే 1500 పడకల ఆస్పత్రిగా మారుతోందని బాబు చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది. చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ కరోనా మహమ్మారిని తక్కువ అంచనా వేయవద్దని... మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో కేసులు పెరిగాయని చెప్పారు. తాము ఏం చెప్పినా వైసీపీ ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని అన్నారు. 
 
రాష్ట్రంలో 11 జిల్లాల్లొ రెడ్ జోన్లు ఉన్నాయని... ప్రత్యేక చర్యలు చేపడితే తప్ప కరోనాను నియంత్రించడం సాధ్యం కాదని అన్నారు. కరోనాపై క్షేత్ర స్థాయిలో యుద్ధం చేసి వారిని రక్షించుకోవాలని చెప్పారు. పొరుగు రాష్ట్రం 350 రూపాయలకు టెస్టింగ్ కిట్ తెచ్చుకుంటే ఏపీ ప్రభుత్వం టెస్టింగ్ కిట్ కోసం 730 రూపాయలు ఖర్చు చేసిందని అన్నారు. పంట నష్టాలతో రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. 
 
ఏపీలో క్వారంటైన్ లో ఉన్నప్పుడే మనుషులు చనిపోతున్నారంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. కరోనా ఆంక్షల మధ్య ఎన్నికల కమిషనర్ కనగరాజ్ ను ఎలా తెచ్చారో చెప్పాలని అన్నారు. కరోనా నివారణ కోసం టెక్నాలజీని వినియోగించుకోవాలని సూచించారు. బయటినుంచి వచ్చిన వారిని తప్పనిసరిగా క్వారంటైన్ కు పంపాలని సూచించారు.              

మరింత సమాచారం తెలుసుకోండి: