దేశంలో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. ప్రతిరోజు వందల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. లాక్ డౌన్ వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. దేశవ్యాప్తంగా మే 3వ తేదీ వరకు లాక్ డౌన్ కొనసాగనుంది. కేంద్రం అకస్మాత్తుగా లాక్ డౌన్ ప్రకటించడంతో చాలామంది ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయారు. సొంతూరికి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నా ఫలించడం లేదని చెబుతున్నారు. 
 
అయితే ఎలాగైనా సొంతూళ్లకు వెళ్లాలని కొందరు చాలా రకాలుగా ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ కు చెందిన ఒక వ్యక్తి సొంతూరికి ఎలా చేరుకున్నాడో తెలిసి షాక్ అవ్వడం గ్రామస్థుల వంతయింది. పూర్తి వివరాలలోకి వెళితే ఉత్తరప్రదేశ్ కు చెందిన ప్రేమ్ మూర్తి పాండే వృత్తిరిత్యా ముంబైలోని ఎయిర్ పోర్టులో పని చేస్తున్నాడు. అతను ముంబైలో ఉన్న సమయంలోనే కేంద్రం లాక్ డౌన్ ను అమలు చేసింది. 
 
అయితే ప్రేమ్ ఎలాగైనా సరే సొంతూరికి చేరుకోవాలని అనుకున్నాడు. ఇందుకోసం ప్రేమ్ పెద్ద ప్లాన్ వేశాడు. ప్రేమ్ ఉత్తరప్రదేశ్ కు వెళ్లడానికి 77,000 రూపాయలు ఖర్చు చేసి ఒక ట్రక్కును అద్దెకు తీసుకున్నాడు. ఆ తర్వాత 2.32 లక్షల రూపాయల ఉల్లిపాయలను కొనుగోలు చేశాడు. ఆ ఉల్లిపాయలను ఉత్తరప్రదేశ్ కు ఎగుమతి చేస్తున్నానని చెప్పి ప్రయాణం ప్రారంభించాడు. ఏప్రిల్ 20న ముంబైలో బయలుదేరిన అతను 23వ తేదీ సొంతూరికి చేరుకున్నాడు. 
 
సొంతూరికి చేరుకోవడానికి ప్రేమ్ వేసిన ప్లాన్ తెలిసి అతని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. లాక్ డౌన్ లో ఇంటికి వెళ్లడానికి ఇలా కూడా చేస్తారా...? అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు నెటిజన్లు మాత్రం ప్రేమ్ తెలివిని తెగ మెచ్చుకుంటున్నారు.                   

మరింత సమాచారం తెలుసుకోండి: