ఏపీలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది. ప్రతిరోజూ 50కు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఈరోజు నమోదైన కేసులతో కలిపి కరోనా కేసుల సంఖ్య 1177కు చేరింది. రాష్ట్రంలో రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాలపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ మూడు జిల్లాల్లోనే దాదాపు 70 శాతం కేసులు నమోదయ్యాయి. 
 
తాజాగా వైసీపీ మంత్రి మోపిదేవి వెంకటరమణ మీడియాతో మాట్లాడుతూ కరోనా వ్యాప్తికి టీడీపీ కార్యకర్తలు కుట్ర చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా వ్యాప్తికి టీడీపీ కార్యకర్తలు స్లీపర్ సెల్స్ లా పని చేస్తున్నారని చెప్పారు. కేసులు పెరిగేందుకు టీడీపీ నేతలు కుట్ర పన్నారా...? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలాంటి కుట్రలకైనా పాల్పడతారని విమర్శలు చేశారు. 
 
కొన్ని ప్రాంతాల్లో కరోనా వ్యాపించడానికి టీడీపీనే కారణమని అనుమానాలు తలెత్తుతున్నాయని చెప్పారు. గవర్నర్ కు కన్నా లక్ష్మీ నారాయణ లేఖ రాయడం కూడా రాజకీయమే అని చెప్పారు. సీఎం జగన్ ను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో టీడీపీ కుట్రలకు పాల్పడుతోందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెట్టడానికి చంద్రబాబు ఏ స్థాయికైనా దిగజారతాడని అన్నారు. 
 
ఈ వ్యాఖ్యలపై చంద్రబాబు, టీడీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. తెలంగాణలో కరోనా కేసులు తక్కువగా నమోదవుతున్నా ఏపీలో మాత్రం కరోనా బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గత మూడు నాలుగు రోజులుగా రాష్ట్రంపై కరోనా పంజా విసురుతోంది. ప్రభుత్వం అధిక సంఖ్యలో పరీక్షలు చేయడం వల్లే ఎక్కువ సంఖ్యలో కేసులు బయటపడుతున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.                             

మరింత సమాచారం తెలుసుకోండి: