వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతుల కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారు. మరికొన్ని కొత్త పథకాలు రూపొందిస్తున్నారు. తాజాగా ఆయన రైతులకు మార్గదర్శనం చేసేందుకు మరో కొత్త వ్యవస్థకు శ్రీకారం చుడుతున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో మండల స్థాయిలో వ్యవసాయ సలహా మండళ్లు ఏర్పాటు చేయబోతున్నారు.

 

 

రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, మండల స్థాయిల్లో త్వరలో ఆంధ్ర ప్రదేశ్ లో వ్యవసాయ సలహా మండళ్లు ఏర్పాటు కాబోతున్నాయి. వీటిని వెంటనే ఏర్పాటు చేయాలని జగన్ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. రైతుల సమస్యలను పరిష్కరించడానికి ఇవి ఉపయోగపడాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. రాష్ట్రస్థాయి అగ్రికల్చర్‌ అడ్వైజరీ బోర్డులు.. జిల్లా స్థాయి బోర్డులకు... అక్కడ నుంచి మండల స్థాయి అడ్వైజరీ బోర్డులకు సలహాలు ఇవ్వాల్సి ఉంటుంది.

 

 

ఏయే పంటలు వేయాలి.. ఎంత వేయాలి.. ఎక్కడ వేయాలి వంటి అంశాలపై మార్కెట్ ను అధ్యయనం చేసి ఈ సలహా మండళ్లు సూచిస్తాయన్నమాట. అంతే కాదు.. పంటలు వేసేటప్పుడే ధర ప్రకటించి, రైతుకు ఆ ధర దక్కేలా ఈ సలహా మండళ్లు క్రియాశీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. ఈ చర్యల వల్ల రైతుల్లో విశ్వాసం కలుగుతోందన్నది సీఎం జగన్ ఆలోచన.

 

 

పంటలను ఇ-క్రాపింగ్‌ చేయడం, రైతు భరోసాకేంద్రాలను వినియోగించి వాటిని కొనుగోలు చేయడం ఈ ప్రక్రియలన్నీ వ్యవస్థీకృతంగా సాగిపోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఏ రోజూ వ్యవసాయం మీద దృష్టిపెట్టలేదని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చాక వ్యవసాయం, అనుబంధ రంగాలు, వాటి పరిస్థితుల మెరుగుదల కోసం ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాం.. కాబట్టి ఆమేరకు ఫలితాలు సాధించాలని జగన్ పట్టుదలగా ఉన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: