వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత‌, వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ముఖ్య‌మంత్రిగా ప‌గ్గాలు చేప‌ట్టి నేటితో ఏడాది. గతేడాది మే 23న 175 స్థానాల్లో 151 అసెంబ్లీ సీట్లు, 22 ఎంపీ సీట్లతో అఖండ విజయాన్ని సాధించిన వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి.. నవ్యాంద్రప్రదేశ్‌ రెండో ముఖ్య‌మంత్రిగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అశేష అభిమానుల మధ్య మే 30న‌ ప్రమాణ స్వీకారం చేశారు.  రాజకీయ అనుభవం లేకున్నా అనుభవజ్ఞులకు నిద్రలేకుండా చేశాడు. తన తండ్రి కలలు కన్న సాకరాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ అమలు చేస్తున్నారు. తొలి ఏడాది సంక్షేమ పాలనకు వందకు వంద మార్కులు వేయించుకున్నాడు.

 

సీఎం వైయస్‌ జగన్‌ ఏడాది పాలన.. సంక్షేమ సంవత్సరంగా సాగింది. సీఎం జగన్‌ పాలనలో ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందాయి. నిజంగా జగన్ మంచి ముఖ్యమంత్రి అయ్యారా..? అయ్యారా అంటే దీనికి ఇంకా స్పష్టత లేదు. ఎందుకంటే సంక్షేమంకు తొలి ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధిపై అప్పుడప్పుడు స్పందిస్తూ.. న్యాయస్థానాల్లో ఎదురుదెబ్బలు తింటూ రాజకీయంగా ఎన్ని ఒత్తిళ్లు వచ్చిన మిస్టర్ కూల్‌గా ఏడాది గ‌డిపేశారు. ఇక 2019 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీడీపీ జూనియ‌ర్ల‌తో పాటు సీనియర్ నేతలకు సైతం ఓటమి తప్పలేదు. 

 

టీడీపీకి కేవలం 23 ఎమ్మెల్యే, మూడు ఎంపీ సీట్లకు పరిమితం అయ్యింది. అయితే ఎన్నిక‌ల ఫ‌లితాల అనంతరం టీడీపీ నేత‌ల్లో చాలా మంది అధికార పార్టీ వైసీపీ వైపే మొగ్గు చూపారు. ఇప్ప‌టికే ప్ర‌కాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే క‌ర‌ణం బ‌ల‌రాం, గుంటూరు జిల్లా గుంటూరు ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే మ‌ద్దాలి గిరిధ‌ర‌రావు, కృష్ణా జిల్లా గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ మోహ‌న్ పార్టీ మారిపోయారు. ఇంకా ప‌లువురు కీల‌క నేత‌లు సైతం వైసీపీ మ‌రియు బీజేపీలో చేరిపోయారు. దీంతో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి టీడీపీని టార్గెట్ చేశారని.. ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అలాగే గత సెప్టెంబర్లో టీడీపీ ఛలో ఆత్మకూరు అని పిలుపునిచ్చింది. 

 

తమ పార్టీ కార్యకర్తల కోసం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి వచ్చిందని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఇక‌ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణానికి అధికార పార్టీ వేధింపులే కారణమని టీడీపీ నేతలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో జగన్ సర్కారు కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందన్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అయితే ఏదేమైన‌ప్ప‌టికీ జ‌గ‌న్ దూకుడుతో టీడీపీలో ఎవ్వ‌రూ మిగిలేలా లేరు అని చాలా మంది అభిప్రాయ‌ప‌డుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: