విజయవాడలో గ్యాంగ్ వార్ ఘటన కలకలం సృష్టించింది. దీనికి సంబంధించిన వీడియోలు చూస్తే.. మళ్లీ ఒకనాటి పాత విజయవాడ నేరాల ఘటనలు గుర్తుకొచ్చాయి. రెండు గ్రూపులు రాళ్లు, కత్తులతో దాడి చేసుకున్న వీడియోలు ఒళ్లు జలధరింపజేశాయి. అయితే ఇంతకీ ఈ గ్యాంగ్ వార్ కు కారణం ఏంటన్న అంశంపై మాత్రం రకరకాల కథనాలు వినిపించాయి. ఈ ఘర్షణలలో సందీప్ అనే యువకుడు మరణించాడు. ఇంకా చాలా మంది గాయపడ్డారు కూడా.

 

 

మొదట్లో ఇది రెండు విద్యార్థి గ్రూపుల మధ్య గొడవగా భావించారు. ఆ విధంగానే మీడియాలో ప్రచారం జరిగింది. ఆ తర్వాత దీన్ని విద్యార్థుల మధ్య సమస్యగా కాకుండా రెండు వర్గాల మధ్య సమస్యగా మీడియాలో ప్రచారం జరిగింది. ఇందులో రాజకీయ నాయకుల ప్రమేయం ఉందని కూడా ప్రచారం జరిగింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇది ఓ భూవివాదంగా తెలుస్తోంది.

 

 

అందులోనూ ఈ గొడవ జరిగింది తెలుగుదేశం, జనసేన గ్రూపులకు మధ్య అని తెలుస్తోంది. యనమలకుదురు వద్ద రెండు కోట్ల రూపాయల విలువ చేసే భూమికి సంబంధించిన వివాదం అని కూడా ప్రచారం జరుగుతోంది. టీడీపీకి చెందిన తోట సందీప్‌, జనసేనకు చెందిన పండు గ్యాంగ్‌ల మధ్య ఘర్షణ జరిగినట్లు పోలీసులు గుర్తించారని మరికొందరు చెబుతున్నారు. వీటిలో ఏది వాస్తవం అన్న విషయంపై మాత్రం ఇంకా ఓ క్లారిటీ రాలేదు.

 

 

పోలీసుల మాత్రం దాదాపు 30 మంది ఘర్షణకు పాల్పడినట్టు గుర్తించామని చెబుతున్నారు. నిందితులను పట్టుకోవడానికి ఆరు బృందాలను ఏర్పాటు చేశామని అంటున్నారు. ఇలాంటి గ్యాంగ్ వార్‌ ఘటనలను సహించబోమంటున్నారు. ఏదేమైనా ప్రశాంతంగా ఉన్న విజయవాడలో ఇలాంటి గ్యాంగ్ వార్ ఘటన మరోసారి కలకలం రేపింది. పోలీసులు మొదట్లోనే ఇలాంటి ధోరణికి అడ్డుకట్ట వేయాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: