దేశంలో కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తోంది. వైరస్ కు వ్యాక్సిన్ లేకపోవడంతో కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహామ్మారిని నియంత్రించడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఆ ప్రయత్నాలేవీ పూర్తి స్థాయిలో ఫలితాలను ఇవ్వడం లేదు. 
 
అయితే కరోనా వ్యాక్సిన్ తయారీలో ఇప్పుడిప్పుడే కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ప్రపంపవ్యాప్తంగా వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనల్లో ఆశాజనకమైన ఫలితాలు వెలువడుతున్నాయి. రష్యా దేశంలోని శాస్త్రవేత్తలు ఇప్పటికే కరోనా డ్రగ్ ను తయారు చేశారు. ఆ డ్రగ్‌ కరోనాను నయం చేయడంలో సమర్థవంతంగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఫావిపిరవిర్ పేరుతో ఓ యాంటీ వైరల్‌ డ్రగ్‌ను 2014లో జపాన్‌లో అప్రూవ్ చేయగా ఇన్‌ఫ్లూయెంజా చికిత్సకు ఆ మందును వినియోగిస్తున్నారు. 
 
రష్యా శాస్త్రవేత్తలు ప్రస్తుతం అదే డ్రగ్ ను ఉపయోగించి ఎవిఫావిర్ పేరుతో మరో డ్రగ్‌ను తయారు చేశారు. శాస్త్రవేత్తల క్లినికల్ ట్రయల్స్ లో ఈ డ్రగ్‌ కరోనాను పూర్తిగా నిరోధిస్తుందని తేలింది. రష్యా ప్రభుత్వం ఈ డ్రగ్ ను వినియోగించడానికి ఇప్పటికే తాత్కాలికంగా అనుమతులు ఇచ్చింది. ఫార్మా కంపెనీ ఈ మందుపై పేటెంట్ పొందింది. ఇప్పటికే 60,000 యూనిట్లను తయారు చేసి ఈ మందును కరోనా రోగుల కోసం వినియోగిస్తున్నారు. 
 
ముంబైకి చెందిన గ్లెన్‌మార్క్‌ ఫార్మాసూటికల్స్‌ కంపెనీ ఫావిపిరవిర్ డ్రగ్ పై మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ ను చేపట్టింది. రష్యాలో ఆ డ్రగ్ నుంచి తయారు చేసిన మరో డ్రగ్ మంచి ఫలితాలు ఇవ్వడంతో భారత్ లో కూడా అలాంటి ఫలితాలే వచ్చే అవకాశం ఉంది. డ్రగ్ పాతదే కాబట్టి క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు ఎటువంటి ఇబ్బందులు లేవు. వైద్య నిపుణులు ఆగష్టులోపు కరోనాకు మెడిసిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: