ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబుపై సీఎం జగన్ పరువు నష్టం దావా వేస్తానంటున్నారు. ఎందుకంటారా.. ఇటీవల చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. విపక్షాలు అన్నాక విమర్శలు చేస్తూనే ఉంటాయి. అయితే అవి పాలసీలపై కాకుండా సీఎంకు చెందిన పరిశ్రమలపైనా చంద్రబాబు విమర్శలు చేశారు. ఇటీవల ప్రభుత్వం జగన్ కు చెందిన సరస్వతీ పవర్ సంస్థకు సున్నపురాయి లీజులు పునరుద్దరించింది. మరో 50ఏళ్ల వరకూ లీజు పర్మిషన్లు ఇచ్చింది.

 

 

దీన్ని చంద్రబాబు తప్పుబట్టారు. జగన్ తన సొంత కంపెనీలకు అడ్డగోలుగా అనుమతులు ఇస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. దీనిపై కేబినెట్ సమావేశంలో స్పందించిన జగన్.. చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. మంత్రివర్గ ఎజెండా అంశాలు పూర్తయ్యాక, ముఖ్యమంత్రి జగన్‌ కలుగజేసుకుని ప్రజలను తప్పుదారి పట్టించేందుకు చంద్రబాబు ఎన్ని అబద్ధాలైనా మాట్లాడతారని విమర్శించారు.

 

 

సరస్వతీ పవర్స్‌కు సున్నపురాయి తవ్వకం లీజు పెంపు విషయంలోనూ చంద్రబాబు ఇష్టారాజ్యంగా విమర్శలు చేస్తున్నారని జగన్ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో లీజు పెంపుకు అనుమతి ఇవ్వకుండా ఆపారని... ఆ కంపెనీ కోర్టుకెళ్లి అనుమతి తెచ్చుకుందని జగన్ వివరించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే సరస్వతీ పవర్స్‌కు లీజు పెంచితే దానిపైనా అడ్డగోలుగా మాట్లాడుతున్నారని అలాంటి వాళ్లపై సంబంధిత శాఖే పరువు నష్టం దావా వేస్తుందని సీఎం జగన్ అంటున్నారు.

 

 

ఆ తర్వాత మంత్రివర్గ సమావేశంలో జగనన్న తోడు పై 20 నిమిషాలకు పైగా చర్చ జరిగిందట. ఈ పథకంలో చిరువ్యాపారులకు సున్నా వడ్డీకి 10 వేలు ఇస్తున్నట్లే స్వర్ణకారులకూ ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి ఒకరు అడిగారట. దీనిపై సీఎం జగన్ స్పందిస్తూ వారికి విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి, సాయం అందించే ఆలోచన ఉందని.. ఆ మేరకు హామీ కూడా ఇచ్చాం కదా అని బదులిచ్చారట.

మరింత సమాచారం తెలుసుకోండి: