ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. మాజీ మంత్రి అచ్చెన్నాయుడి అరెస్టుతో తెలుగు దేశంలో కలకలం రేగింది. జగన్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన నేపథ్యంలో ఇక తెలుగు దేశం అక్రమాలపై సీరియస్ గా దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. ఏదీ మా అక్రమాలు నిరూపించు అంటూ ఇటీవల తెలుగుదేశం నేతల సవాళ్లను సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ రెడీ చేసినట్టు కనిపిస్తోంది.

 

 

ప్రస్తుతానికి అచ్చెన్న అరెస్టుతో మొదలైన ఈ అరెస్టుల పర్వం ముందు ముందు మరింత జోరందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ మంత్రుల కామెంట్లు చూస్తే.. ముందు ముందు లోకేశ్, చంద్రబాబు అరెస్టులు కూడా తప్పేలా లేవు. ఈ మేరకు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నెల్లూరులో మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఈఎస్‌ఐ స్కామ్‌లో పూర్తి విచారణ జరుగుతోందని, పెద్దబాబు, చిన్నబాబు పాత్ర కూడా బయటకొస్తుందన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు.

 

 

ఈఎస్‌ఐ స్కామ్‌లో రూ.150 కోట్ల అవినీతికి పాల్పడిన అచ్చెన్నాయుడిని అరెస్టు చేస్తే.. కిడ్నాప్‌ చేశారంటూ చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని ఇరిగేషన్‌ శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ అంటున్నారు. అవినీతి చేసిన వ్యక్తిని అరెస్టు చేస్తే.. దాన్ని కులాలకు ఆపాదించడం సరికాదన్నారు. అవినీతి పాల్పడి అరెస్టు అయిన అచ్చెన్నాయుడికి అండగా నిలవాలని చంద్రబాబు బీసీలను కోరడం విడ్డూరంగా ఉందన్నారు.

 

 

ఇదే సమయలో గతంలో చంద్రబాబు చేసిన పనులను గుర్తు చేస్తున్నారు మంత్రి అనిల్. గతంలో బీసీలు జడ్జిలుగా పనికిరారని చంద్రబాబు లేఖ రాసిన సంగతి బడుగు, బలహీనవర్గాల ప్రజలు మర్చిపోరన్నారు. బీసీలను వాడుకొని వారికి అన్యాయం చేసిన చరిత్ర చంద్రబాబుదన్నారు. బీసీల ఎదుగుద‌ల గురించి చంద్ర‌బాబు ఏనాడూ ఆలోచించ‌లేద‌న్నారు. త‌ప్పు బీసీ చేసినా, ఎస్సీ చేసినా, ఎస్టీ చేసినా త‌ప్పు త‌ప్పేన‌ని, ఏం జ‌రిగింద‌ని బీసీలంతా రోడ్ల మీద‌కు రావాలి చంద్రబాబూ అని మంత్రి అనిల్ ప్రశ్నించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: