ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు కష్టకాలం దాపురించినట్టే ఉంది. నిన్న మొన్నటి వరకూ దమ్ముంటే ఎలాంటి విచారణ అయినా చేసుకో అంటూ గర్జించిన చంద్రబాబు కోరికను ఏపీ సీఎం జగన్ మన్నించినట్టే కనిపిస్తున్నాడు. ఇప్పటికే శాంపిల్ గా ఈఎస్‌ఐ కేసులో అచ్చెన్నాయుడిని అరెస్టు చేసిన జగన్ సర్కారు తదుపరి టార్గెట్ చంద్రబాబు, లోకేశ్ అన్న టాక్ వినిపిస్తోంది. ఇటీవల కేబినెట్ మీటింగ్‌లో ఫైబర్ గ్రిడ్, చంద్రన్న కానుక వంటి పథకాల్లో చోటు చేసుకున్న అవినీతిపై సర్కారు ఫోకస్ చేసింది.

 

 

చంద్రబాబుకు హెరిటేజ్ అనే ఓ కంపెనీ ఉన్న సంగతి తెలిసిందే. చంద్రబాబు, లోకేశ్ రాజకీయాల్లో ఉంటే చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, లోకేశ్ సతీమణి బ్రాహ్మణిహెరిటేజ్ వ్యవహారాలు చూసుకుంటారు. అయితే ఇప్పుడు చంద్రన్న కానుక పై విచారణకు సర్కారు ఆదేశించడంతో ఒక్కసారిగా హెరిటేజ్ సంస్థ లో కలవరం మొదలైంది. ఎందుకంటే.. చంద్రబాబు హాయంలో చంద్రన్న కానుకల ప్యాకెట్లలో నెయ్యిని హెరిటేజ్ సంస్థ నుంచే కొనేవారు.

 

 

హెరిటేజ్ నెయ్యే కాకుండా... హెరిటేజ్ పాలు, పెరుగు, మజ్జిగ వంటి వాటిని కూడా ఏపీ సర్కారు గతంలో కొనుగోలు చేసింది. అయితే సర్కారు మనదే అన్న భరోసాతో చంద్రబాబు ఈ హెరిటేజ్ ఉత్పత్తులను మార్కెట్ రేటు కంటే చాలా ఎక్కువ ధరలకు కొనేవారని వైసీపీ ఆరోపిస్తోంది. ఇప్పుడు ఆ లెక్కలన్నీ తవ్వి తీస్తున్న ప్రభుత్వం చంద్రబాబు, లోకేశ్ లను ఇరుకునపెట్టే అవకాశం కనిపిస్తోంది.

 

 

చంద్రబాబుకు ఇన్నాళ్లూ కాసులు కురిపించిన ఈ హెరిటేజ్ కంపెనీ ఇప్పుడు చంద్రబాబుకు ఇబ్బందిగా మారిందా అనిపిస్తోంది. సర్కారు విచారణలో ఏమైనా అక్రమాలు తేలితే చంద్రబాబు అరెస్టు కూడా ఖాయమే. మరి జగన్ సర్కారు అంత సాహసం చేస్తుందా లేదా అన్నదే ఇప్పుడు అందరినీ ఉత్కంఠకు గురి చేస్తున్న ప్రశ్న.

 

మరింత సమాచారం తెలుసుకోండి: