దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. అన్ లాక్ 2.0 సడలింపుల తర్వాత ప్రతిరోజూ తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఏపీలో నిన్న ఒక్కరోజే 5,000కు పైగా కరోనా కేసులు నమోదయ్యాయంటే పరిస్థితిని సులభంగానే అంచనా వేయవచ్చు. కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ వస్తే మాత్రమే వైరస్ నియంత్రణ సాధ్యమవుతుందని వైద్యులు, ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు. 
 
అయితే కరోనా వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందనే ప్రశ్నకు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ కోసం అనేక ప్రయోగాలు చేస్తున్నారు. అయితే తాజాగా సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఈ సంవత్సరం చివరకు కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. ఆస్ట్రాజెనెకా ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ మొదట ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సీరమ్ ఇన్స్టిట్యూట్ భావిస్తోంది. 
 
తాము ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ తో కలిసి పని చేస్తున్నామని... ఆగష్టు నెలలో మనుషులపై కూడా ప్రయోగాలు చేస్తామని... ప్రస్తుత పరిస్థితులు, ప్రయోగ ఫలితాలను బట్టి చూస్తే డిసెంబర్ నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సీఈవో అడార్ పూనావాలా చెప్పారు. ఆక్స్ ఫర్డ్ తయారు చేస్తున్న కరోనా వ్యాక్సిన్ ను 100 కోట్ల డోసులు ఉత్పత్తి చేసేందుకు ఆస్ట్రాజెనెకాతో ఒప్పందం కుదుర్చుకున్నామని ఆయన తెలిపారు.               
 
భారత్ తో పాటు తక్కువ ఆదాయం ఉన్న దేశాలలో ఈ వ్యాక్సిన్ ను లభిస్తాయని పేర్కొన్నారు. భారత్ లో ఏడు ఔషధ సంస్థలు వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. సాధారణంగా వ్యాక్సిన్ తయారీ, ఉత్పత్తికి కొన్నేళ్ల సమయం పడుతుంది కానీ కరోనా వల్ల నెలకొన్న విపత్కర పరిస్థితుల నేపథ్యంలో వ్యాక్సిన్ ను త్వరగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పరిశోధనలు జరుగుతున్నాయి. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: